Real Estate News: ఎలక్ట్రానిక్స్ నగరంగా పేరొందిన బెంగళూరులో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. టెక్ హబ్ లో ఏళ్ల తరబడి కోట్లాది రూపాయలను అద్దెలుగా పొంది యజమానుల కలలు కల్లలవుతున్నాయి. నగరం నుంచి పలు టెక్ కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోతుండటంతో ఇంటి అద్దెల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. వేలకు వేలు రెంట్స్‌తో పాటు భారీగా డిపాజిట్లు కలెక్ట్ చేసేవారు కాస్తా ఇప్పుడు వెనక్కి తగ్గాల్సి వస్తోంది.
రెండేళ్లుగా అద్దెల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న టెక్కీలు క్రమంగా బెంగళూరు సిటీ నుంచి శివారు ప్రాంతాలకు మరలుతున్నారు. దీంతో వైట్ ఫీల్డ్ వంటి సబర్బన్ ప్రాంతాలలో ఇంటి అద్దెలు 15 నుంచి 20 శాతం మేర తగ్గినట్లు బ్రోకర్లు చెప్తున్నారు. సర్జాపుర, వైట్ ఫీల్డ్, హుడీ, ఔటర్ రింగ్ రోడ్ వంటి ఏరియాలలో 2BHK కోసం 35 నుంచి 40 వేలు వెచ్చించాల్సి వచ్చేది. అయితే నగర శివార్లకు మారిన తర్వాత 38వేలకే 3BHK పొందగలుగుతున్నట్లు అద్దె నివాసితులు పేర్కొంటున్నారు.

ఇక గతేడాది బెంగళూరు నగరంలో ఇల్లు దొరకడమే కష్టంగా మారింది. ఫ్లాట్ రెంట్ కోసం భారీ డిపాజిట్లతోపాటు కొన్నిచోట్ల ఉద్యోగాలకు మాదిరిగా ఇంటర్వ్యూలు సైతం హాజరు కావలసిన అవసరం ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు చెబుతున్నారు. అద్దె ఇన్వెంటరీల పెరుగుదలతో భవనాల యజమానులు దిగివస్తున్నారు. అద్దెను తగ్గించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారని పలువురు స్పష్టం చేస్తున్నారు.
కోరమంగలలో 3BHK కోసం 75 వేలను అద్దెగా భవనం యజమాని నిర్ణయించారు. అయితే అటువైపు ఎవరు కన్నెత్తి కూడా చూడకపోవడంతో 10 వేలు తగ్గించి రెంట్‌కి ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. వైట్ ఫీల్డ్ శివార్లలోని బుడిగెరలో కూడా ఇదే తరహా పరిస్థితులు రిపీట్ అయినట్లు సమాచారం. మైసూర్ రోడ్ లో గతంలో 40 వేలు అద్దె పలికే 2BHKను ఇప్పుడు 30 వేలకే సాధించినట్లు ఇటీవల ఓ టెక్కీ వెల్లడించారు. రానున్న రోజుల్లో అద్దెలు మరింత తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications