Bangalore News: గతంలో ప్రయాణాలు అంటే కేవలం బస్సులు, రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా చిన్న దూరాల కోసం ఆటోలు, కార్లు తదనంతరం పుట్టుకొచ్చాయి. సాంకేతికత మరింత విస్తరించిన నేపథ్యంలో ఓలా, ఉబెర్ వంటి రైడ్ హెయిలింగ్ సంస్థలు పురుడు పోసుకున్నాయి. ఈ రంగంలో పోటీదారులు ఎక్కువగా లేకపోవడంతో.. వారు చెప్పిందే వేదంగా ఆ రెండు సంస్థలు చలామణి అవుతున్నాయి. దీనిపై బాహాటంగానే ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి.
కాగా ఈ రెండు సంస్థల గుత్తాధిపత్యాన్ని నిలువరించేందుకు బెంగళూరుకు చెందిన డ్రైవర్లు మాస్టర్ ప్లాన్ వేశారు. సదరు రైడ్ హెయిలింగ్ కంపెనీలకు తమ కష్టార్జితంలో పెద్ద మొత్తాన్ని సమర్పించుకోవడం ఇష్టం లేక ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం సాధారణంగా ప్రజలు రోజువారీ ఉపయోగించే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి గ్రూపులను టార్గెట్ చేసుకున్నారు. వీటితోపాటు జీరో-కమిషన్ ఆధారిత అగ్రిగేటర్లను ఆశ్రయిస్తున్నారు.

డ్రైవర్ల యూనియన్లు కూడా జీరో-కమిషన్ అగ్రిగేటర్లకు మద్దతు ప్రకటించడంతో.. ఓలా, ఉబెర్లకు కష్టకాలం మొదలైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ డ్రైవర్లను నిలుపుకునేందుకు ఆ రెండు సంస్థలు ఇబ్బందులు పడుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. డ్రైవర్ల లభ్యత తక్కువగా ఉంటే కస్టమర్లు ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తుంది. ఇది సదరు సంస్థలకు పెద్ద ఎదురు దెబ్బగా మారుతోందని టెక్ హబ్ లోని డ్రైవర్లు భావిస్తున్నారు.
'డ్యూటీ గ్రూప్స్' పేరిట బెంగళూరులో డ్రైవర్లకు సంబంధించి వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌లు ప్రఖ్యాతిగాంచాయి. ఇవి రెండేళ్లుగా కొనసాగుతుండగా వాటిలో సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. వీటిలోనూ రెండు రకాలు ఉన్నట్లు సమాచారం. ఏదైనా కారణం వల్ల ఓ డ్రైవర్ కస్టమర్ ను డ్రాప్ చేయలేకపోతే వెంటనే గ్రూపులోని ఇతరులకు సమాచారం ఇస్తారు. వారు వెంటనే స్పందించి ఆ ట్రిప్ పూర్తి చేస్తారు.
ఇక మరో గ్రూపులో ట్రావెల్ ఏజెంట్లు, టెక్ పార్కులు మరియు IT సంస్థలు, ప్రైవేట్ కంపెనీల అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ సభ్యులుగా ఉంటారు. వారు తమ ఉద్యోగుల కోసం ఇంటర్ సిటీ ట్రిప్స్ అవసరాలను వాటిలో పోస్ట్ చేస్తారు. అదే గ్రూపులో ఉన్న డ్రైవర్లు అవసరానికి తగినట్లు సేవలు అందిస్తారు. ఈ రకంగా ఓలా, ఉబెర్ లపై బెంగళూరు డ్రైవర్లు ఏకంగా వార్ డిక్లేర్ చేశారని విశ్లేషణలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications