Bajaj Finance: బజాజ్ ఫైనాన్స్ నెత్తిన రెండు పిడుగులు.. కస్టమర్లకు ఆ సేవ నిలిపివేత..
Bajaj Finance: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తీసుకున్న రెండు నిర్ణయాలు ఫైనాన్స్ వ్యాపారంలో పేరుగాంచిన బజాజ్ సంస్థకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరుసగా ఒకదాని వెంట మరొకటి రావటం కంపెనీని ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
బజాజ్ ఫైనాన్స్ కొత్త కస్టమర్లకు EMI కార్డ్‌ల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. రిజర్వ్ బ్యాంక్ ఇటీవలి చర్య తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని కంపెనీ స్టాక్ మార్కెట్లకు వెల్లడించింది. రిజర్వు బ్యాంక్ గుర్తించిన లోపాలను సరిదిద్దేంత వరకు ఈ మారటోరియం అమలులో ఉంటుందని తెలుస్తోంది. వీలైనంత త్వరగా లోపాలను సవరించేందుకు కంపెనీ అవసరమైన చర్యలను తీసుకునే పనిలో ఉన్నట్లు బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది.

బజాజ్ ఫైనాన్స్ రెండు రుణ ఉత్పత్తులైన 'Ecom', 'Insta EMI కార్డ్' విషయంలో రుణాల ఆమోదం, పంపిణీ తక్షణమే అమలులోకి తీసుకొచ్చేందుకు రూపొందించబడ్డాయి. అయితే ఈ క్రమంలో కంపెనీ రిజర్వు బ్యాంక్ నిర్థేశించిన డిజిటల్ లోన్ గైడ్‌లైన్స్‌లో ఉన్న నిబంధనలను పాటించలేదని ఆర్బీఐ గుర్తించింది. ముఖ్యంగా ఈ రెండు రుణ ఉత్పత్తులు, మంజూరు చేయబడిన ఇతర డిజిటల్ రుణాల కింద కస్టమర్‌లకు కీలకమైన వాస్తవాలను బహిర్గతం చేయటం లేదని రిజర్వు బ్యాంక్ గమనించింది. దీంతో ఉత్పత్తులను కొత్త కస్టమర్లకు విక్రయించటాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
ఇది జరిగిన రోజులు గడవక ముందరే రిటైల్ రుణాల విషయంలో సంస్థలు రిస్క్ వెయిటేజ్ పెంచాలంటూ రిజర్వు బ్యాంక్ దేశంలోని అన్ని ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సంస్థలను ఆదేశించింది. దీంతో స్టాక్ మార్కెట్లలో ఫైనాన్స్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ సమయంలో బజాజ్ ఫైనాన్స్ సైతం ప్రతికూలంగా ప్రభావితమైంది. రిజర్వు బ్యాంక్ తాజా చర్యల కారణంగా గతంలో 100 రూపాయలు రుణాన్ని ఇచ్చేందుకు ఫైనాన్స్ సంస్థలు 9 రూపాయల మూలధనం ఉంటే సరిపోయేది.. కానీ ఇప్పుడు దీనికోసం 11.25 రూపాయలు కలిగి ఉండాల్సి ఉంది. దీంతో రానున్న కాలంలో రుణ వడ్డీ రేట్లు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications