Adani News: ఏదేమైనప్పటికీ 2023 ఏడాది ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీని వెంటాడుతూనే ఉంది. ఎందుకో ఈ ఏడాది ఆయనకు అస్సలు కలిసిరాలేదని చెప్పుకోవచ్చు. వరుస నష్టాలు, ఆరోపణలు, విమర్శలు, సంపద ఆవిరి ఆయనను చుట్టుముట్టాయి.
జనవరిలో హిండెన్‌బర్గ్ ఆరోపణల షాక్ వేవ్ నుంచి అదానీ గ్రూప్ ఇంకా పూర్తిగా తేరుకోలేదని తెలుస్తోంది. షేర్ల భారీ పతనం కారణంగా గ్రూప్ ఉమ్మడి విలువ ఏకంగా 130 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని చూడాల్సి వచ్చింది. ఇది వ్యక్తిగతంగా గౌతమ్ అదానీ సంపదను క్షీణింపజేసింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానం నుంచి ఇండియన్ బిలియనీర్ కిందకు పడిపోయారు.

అయితే భారతదేశంలో రెండవ అతిపెద్ద కుబేరుడిగా కొనసాగుతున్న గౌతమ్ అదానీ ఈ ఏడాది సంపద నష్టంలో ముందంజలో ఉన్నారు. గౌతమ్ అదానీ సంపద ఏడాది కాలంలో 60 బిలియన్ డాలర్లు తగ్గినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం వెల్లడైంది. గత ఏడాది ప్రపంచ కుబేరుల్లో టాప్-10 మందిలో ఒకరిగా దీపావళి జరుపుకున్న గౌతమ్ అదానీ.. ప్రస్తుతం నవంబర్ 12, 2023లో మాత్రం 21వ స్థానానికి పరిమితమయ్యారు. దీంతో ప్రపంచంలో అత్యధికంగా నష్టపోతున్న బిలియనీర్ల జాబితాలో అదానీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 60.6 బిలియన్ డాలర్లుగా కొనసాగుతోంది. అలాగే ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అనేక సంస్థలు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇటీవల విడుదలైన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో మెుత్తం 10 అదానీ లిస్టెడ్ కంపెనీల్లో ఏడు నికర లాభాలను నమోదు చేశాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ విల్మార్, ఎన్జీటీవీ కంపెనీలు భారీగా లాభాల క్షీణతను నమోదు చేశాయి. ఇదే సమయంలో లాభాల్లో ఉన్న 7 కంపెనీల్లో అంబుజా సిమెంట్స్ భారీగా లాభాలతో ముందంజలో నిలిచింది. ఏడాది ప్రాతిపదికన లిస్టెడ్ కంపెనీల నికర లాభం ఏకంగా 1835 శాతం పెరుగుదలతో రూ.987 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications