ఇడ్లీ అమ్మితే రూ. 150 కోట్లా? బెంగళూరులో ఈ ఆంధ్ర స్టార్టప్ సృష్టిస్తున్న సంచలనం ఇదే!
ఆంధ్ర స్టైల్ నెయ్యి ఇడ్లీ, కారం దోశల రుచికి బెంగళూరు ఫిదా అయిపోయింది. మన తెలుగింటి రుచులను అందిస్తున్న క్యూఎస్ఆర్ (QSR) బ్రాండ్ బాబాయ్ టిఫిన్స్ (Babai Tiffins) తాజాగా రూ. 15.5 కోట్ల భారీ నిధులను సేకరించింది. ఇందులో విశేషం ఏంటంటే.. ప్రముఖ నటుడు సునీల్ శెట్టి హోస్ట్ చేసిన 'భారత్ కే సూపర్ ఫౌండర్స్' (BKSF) బిజినెస్ రియాలిటీ షో ద్వారానే రూ. 10.5 కోట్లు దక్కించుకుని ఈ స్టార్టప్ (startup) రికార్డు సృష్టించింది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ MX ప్లేయర్‌లో జనవరి 24న ప్రసారమైన 'భారత్ కే సూపర్ ఫౌండర్స్' (BKSF) అనే బిజినెస్ రియాలిటీ షో లో.. ఈ బ్రాండ్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుని అత్యధిక రేటింగ్ పొందింది. ఈ షోలో అత్యధిక ఫండ్ రైజర్ గా బాబాయ్ టిఫిన్స్ నిలిచింది. రికర్ క్లబ్ (Recur Club) నుండి రూ. 2.5 కోట్ల వెంచర్ డెట్ కూడా ఇందులో ఉంది.
ఒకే ఒక్క అవుట్‌లెట్ నుండి రూ. 50 కోట్ల రెవెన్యూ వరకు..
అల్లు శివరామకృష్ణారెడ్డి, రవి మొరంపూడి స్థాపించిన ఈ బ్రాండ్.. కేవలం ఆంధ్ర ఇంటి రుచులపై ఉన్న మక్కువతో మొదలైంది. ప్రస్తుతం బెంగళూరులో కేవలం మూడు అవుట్‌లెట్లతోనే నెలకు దాదాపు 2 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తూ.. ఏడాదికి రూ. 50 కోట్ల ఆదాయాన్ని (Revenue) గడిస్తోంది. ఆంధ్ర వంటకాలకు ఉన్న డిమాండ్ ను పసిగట్టిన ఈ స్టార్టప్ (startup).. ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదిగేందుకు సిద్ధమైంది.
ఇన్వెస్టర్ల క్యూ.. ప్రముఖుల మద్దతు
వార్మప్ వెంచర్స్ (Warmup Ventures) నేతృత్వంలో జరిగిన ఈ ఫండింగ్ రౌండ్ లో థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ. వేలుమణి, అంకుర్ మిట్టల్, సిడిఎం క్యాపిటల్, ఓపెన్ సీక్రెట్స్ ఫౌండర్ అహానా గౌతమ్ వంటి దిగ్గజాలు పెట్టుబడులు పెట్టారు.
"ఆంధ్ర వంటకాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సరైన సిస్టమ్స్, రుచి ఉంటే ఏ బ్రాండ్ అయినా సక్సెస్ అవుతుందని బాబాయ్ టిఫిన్స్ నిరూపిస్తోంది" అని వార్మప్ వెంచర్స్ కో-ఫౌండర్ శరద్ బన్సాల్ కొనియాడారు.
భవిష్యత్తు ప్రణాళికలు: 3 నుండి 10 అవుట్‌లెట్లకు!
వచ్చిన కొత్త పెట్టుబడితో బాబాయ్ టిఫిన్స్ రాబోయే రెండేళ్లలో తన అవుట్‌లెట్ల సంఖ్యను 3 నుండి 10 కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా రూ. 150 కోట్ల రెవెన్యూను టార్గెట్ చేస్తోంది. కేవలం టిఫిన్లే కాకుండా, ఆంధ్ర గ్రామీణ రుచులైన పొడులు (Podis), ఆవకాయ, పచ్చళ్లు (Pickles), పిండి వంటలు, లోకల్ స్వీట్లు వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నారు. తద్వారా ప్రతి తెలుగింటి వంటగదిలోకి తమ బ్రాండ్ ను తీసుకెళ్లాలన్నది వీరి ప్లాన్.
మారుతున్న కాలంలో ప్రజలు పిజ్జా, బర్గర్లకు బదులు నాణ్యమైన, ప్రామాణికమైన ప్రాంతీయ వంటకాల కోసం ఆరాటపడుతున్నారు. ఈ ట్రెండ్ ను ఉపయోగించుకుని బాబాయ్ టిఫిన్స్ దేశ వ్యాప్తంగా ఆంధ్ర భోజన వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications