Patanjali: బాబా రామ్‌దేవ్ బడా ప్లాన్.. అదానీకి పోటీగా పతంజలి.. త్వరలో మార్కెట్లోకి 4 ఐపీవోలు..
Patanjali: యోగా గురు బాబా రామ్‌దేవ్ పతంజలికి అభివృద్ధి ప్రణాళికలను నేడు ప్రకటించారు. ఇందులో భాగంగా పతంజలి ఆయుర్వేద్, పతంజలి వెల్‌నెస్, పతంజలి మెడిసిన్, పతంజలి లైఫ్‌స్టైల్ కంపెనీలను మార్కెట్లోకి ఐపీవోగా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ.40,000 కోట్లుగా ఉంది. రానున్న కాలంలో వ్యాపారాల ద్వారా దేశవ్యాప్తంగా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

5 లక్షల కోట్లు వ్యాపారం:
రానున్న ఐదేళ్లలో మార్కెట్లోకి కంపెనీలను తీసుకురావటంతో పాటు.. వాటి మార్కెట్ క్యాప్ ను రూ.5 లక్షల కోట్లకు తీసుకెళ్లటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాబా రామ్‌దేవ్ వెల్లడించారు. ప్రస్తుతం కేవలం పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మాత్రమే లిస్ట్ చేయబడింది. 2027 లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో పతంజలి ఆదాయం రూ.10,664.46 కోట్లకు పెరిగింది. కంపెనీ నికర లాభం రూ.740.38 కోట్లుగా ఉంది.

ఉత్తరాఖండ్‌లో పెట్టుబడులు:
పతంజలి యోగపీఠ్ ఉత్తరాఖండ్‌లో రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతుందని యోగా గురువు బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, ఉత్తరాఖండ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉంటాయని అన్నారు.

అదానీకి పోటీగా:
ప్రస్తుతం దేశంలో రిటైల్ మార్కెట్‌లో రెండు పెద్ద వంటనూనె అమ్మే కంపెనీలు ఉన్నాయి. వాటిలో మెుదటిది అదానీకి చెందిన అదానీ విల్మర్ కాగా మరొకటి రామ్‌దేవ్ కు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్. దీనికి తోడు పతంజలి.. హిందుస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్, ప్రాక్టర్ & గాంబుల్ కంపెనీల మార్కెట్ వాటాను పొందటానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

రామ్‌దేవ్ బిగ్ ప్లాన్:
పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటానికి పతంజలి గ్రూప్ 15 లక్షల ఎకరాలకు పైగా భూమిలో పామ్ చెట్లను నాటుతోంది. 11 రాష్ట్రాల్లోని 55 జిల్లాల్లో ఈ చెట్లను నాటనున్నారు. దీంతో 5 నుంచి 7 ఏళ్లలో దాదాపు రూ.2 వేల కోట్ల వార్షిక రాబడిని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చెట్లను ఒక్కసారి నాటతం ద్వారా 40 ఏళ్లపాటు ఆదాయాన్ని పొందేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.


Click it and Unblock the Notifications