యాక్సిస్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యాక్సిస్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కొత్త ఎండీ, సీఈఓ బి గోప్‌కుమార్‌ను ప్రకటించారు. ఆయన ప్రస్తుత ఫండ్ హౌస్ హెడ్ చంద్రేష్ నిగమ్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో చంద్రేష్ నిగమ్ వైదొలిగినట్లు కంపెనీ పేర్కొంది. చంద్రేష్ నిగమ్ ఒక దశాబ్దం పాటు యాక్సిస్ AMCలో పని చేశారు.
ఆయన 2009లో కంపెనీలో ఈక్విటీస్ హెడ్‌గా చేరారు. 2013లో MD, CEOగా బాధ్యతలు చేపట్టారు. ఆయన MD, CEOగా ఉన్న సమయంలో, ఫండ్ హౌస్ ఆస్తులు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 2013లో రూ. 18,000 కోట్ల నుంచి జనవరి 2023 నాటికి రూ. 2.82 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే, కంపెనీ ఇటీవలే ఒక ఫ్రంట్-రన్నింగ్ కుంభకోణంలో చిక్కుకుంది. ఆ తర్వాత చీఫ్ డీలర్ వీరేష్ జోషిని సస్పెండ్ చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆశిష్ గుప్తాను కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా నియమించింది. గుప్తా గతంలో క్రెడిట్ సూయిస్‌లో ఇండియా ఈక్విటీ రీసెర్చ్ హెడ్‌గా ఉన్నారు. వివిధ పరిశ్రమలలోని భారతీయ మార్కెట్‌లను ట్రాక్ చేయడంలో 25 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు.
గోప్‌కుమార్ ప్రస్తుతం యాక్సిస్ సెక్యూరిటీస్ MD, CEO, ఆర్థిక సేవల పరిశ్రమలో 28 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. అవసరమైన అనుమతులకు లోబడి, అతను మే 1, 2023 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అంటే మూడు సంవత్సరాల పాటు యాక్సిస్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎండీ, సీఈఓగా పని చేయనున్నారు.


Click it and Unblock the Notifications