IPO News: 2023ను ఐపీవోల సంవత్సరంగా చెప్పుకోవచ్చు. గడచిన కొన్నేళ్లలో ఎన్నడూ చూడనన్ని కంపెనీల ఐపీవోలు ఈ ఒక్క ఏడాదే మార్కెట్లోకి వచ్చాయి. ప్రధానంగా మార్కెట్లలో ఇన్వెస్టర్ల స్వీకరణ దీనికి కారణంగా నిలుస్తోంది.
ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్(Azad Engineering Limited) త్వరలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలోకి తన ఐపీవోను తీసుకురావాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(DRHP)ని దాఖలు చేసింది. కంపెనీ ముసాయిదా పత్రాల ప్రకారం మెుత్తం రూ.740 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడైంది. ఇందులో రూ.500 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్ల ఈక్విటీ విక్రయిస్తుండగా.. మిగిలిన రూ.240 కోట్లు తాజా ఇష్యూగా ఉంది.

కొత్త ఇష్యూ ద్వారా సేకరించే సొమ్మును కంపెనీ మూలధన వ్యయం, రుణాల చెల్లింపులతో పాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది. ప్రమోటర్ రాకేష్ చోప్దార్ రూ.170 కోట్ల వరకు విలువైన ఈక్విటీ షేర్లను విక్రయిస్తుండగా.. పిరమల్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్ రూ.280 కోట్ల విలువైన ఈక్విటీలను, DMI ఫైనాన్స్ రూ.50 కోట్ల ఈక్విటీలను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయిస్తున్నాయి. కంపెనీ ఏరోస్పేస్, క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్, చమురుతో పాటు గ్యాస్ పరిశ్రమల కోసం ఇంజనీరింగ్ & సాంకేతిక పరిష్కారాలను అందిస్తుంది.
కంపెనీ ఆదాయాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.124 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2023 ఫైనాన్సియల్ ఇయర్ లో రూ.251.7 కోట్లకు చేరుకుంది. కంపెనీ ప్రస్తుతం జనరల్ ఎలక్ట్రిక్, హనీవెల్ ఇంటర్నేషనల్ ఇంక్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సిమెన్స్ ఎనర్జీ, ఈటన్ ఏరోస్పేస్, MAN ఎనర్జీ సొల్యూషన్స్ SE వంటి దిగ్గజ కంపెనీలకు సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications