మధ్యప్రాచ్యంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అమెరికా , ఇజ్రాయెల్ జరిపిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు నిర్ధారణ కావడంతో.. ఇరాన్ తన తదుపరి నాయకత్వ మార్పుపై దృష్టి సారించింది. ఇరాన్ రాజ్యాంగ యంత్రాంగం ప్రకారం.. కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు దేశాన్ని నడిపించడానికి ఒక మధ్యంతర నాయకత్వ మండలిని (Interim Leadership Council) ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్‌లో కీలక సభ్యుడిగా సీనియర్ మతగురువు అయాతొల్లా అలీరెజా అరాఫీని నియమించారు. ఇరాన్ ఇజ్రాయెల్ (iran Israel) మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఈ నియామకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎవరు ఈ అయాతొల్లా అరాఫీ?
1959లో యాజ్ద్ ప్రాంతంలోని మెయ్‌బోడ్‌లో ఒక మతపరమైన కుటుంబంలో అరాఫీ జన్మించారు. ఆయన తండ్రి అయాతొల్లా మొహమ్మద్ ఇబ్రహీం అరాఫీ, ఇరాన్ ఇస్లామిక్ విప్లవ పితామహుడు రుహొల్లా ఖొమేనీకి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుత ఇరాన్ అధికార నిర్మాణంలో అరాఫీకి మంచి పట్టు ఉంది. విప్లవ కాలం నాటి పాతతరం నాయకులు మరుగున పడుతున్న తరుణంలో, అరాఫీ వంటి వ్యక్తులు దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడైన మసూద్ పెజెష్కియాన్ , చీఫ్ జస్టిస్ మొహ్సేని-ఎజెయితో కలిసి దేశాన్ని నడిపించనున్నారు.
ఖమేనీ మరణం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఒక ప్రకటన చేస్తూ, ఖమేనీ మరణం ఇరాన్ ప్రజలకు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దక్కిన అతిపెద్ద అవకాశం అని పేర్కొన్నారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత దుర్మార్గుల్లో ఒకరిగా అభివర్ణించిన ట్రంప్, అమెరికా నిఘా , అత్యాధునిక ట్రాకింగ్ సిస్టమ్స్ నుండి ఆయన తప్పించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, ఇరాన్‌పై ఖచ్చితత్వంతో కూడిన దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని హెచ్చరించడం ద్వారా ఇరాన్ ఇజ్రాయెల్ (iran Israel) వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
40 రోజుల సంతాపం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
ఖమేనీ మరణానికి గుర్తుగా ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. షియా ముస్లిం సంప్రదాయంలో మరణించిన 40వ రోజును 'అర్బయిన్' (Arba'een) అని పిలుస్తారు, దీనికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా జెండాలను సగం వరకు దించి ఉంచారు. ప్రజలు తమ ప్రియతమ నేతకు నివాళులు అర్పించేందుకు భారీ ఎత్తున సిద్ధమవుతున్నారు. 86 ఏళ్ల వయస్సులో మరణించిన ఖమేనీ, 1989 నుండి అంటే దాదాపు 37 ఏళ్ల పాటు ఇరాన్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించారు.
ఇరాన్ భవిష్యత్తుపై అనిశ్చితి
ఖమేనీ మరణం ఇరాన్ చరిత్రలో ఒక అధ్యాయాన్ని ముగించింది. 1979 విప్లవం తర్వాత దేశంలో నాయకత్వ మార్పు జరగడం ఇది రెండోసారి మాత్రమే. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల మధ్య కొత్త సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. అరాఫీ నేతృత్వంలోని మధ్యంతర మండలి దేశంలో శాంతిభద్రతలను కాపాడుతూనే, అమెరికా , ఇజ్రాయెల్ దాడులను ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. ఇరాన్ ప్రజలు , అంతర్జాతీయ సమాజం ఇప్పుడు టెహ్రాన్ నుండి వెలువడే ప్రతి చిన్న వార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications