వారు మాత్రమే చాలా లక్కీ!! ఈసారి భారీగా పడిపోయిన వేతన పెంపు
కరోనా మహమ్మారి కారణంగా ఈసారి వివిధ రంగాల్లోని అన్ని కంపెనీలు శాలరీ కోత, ఉద్యోగాల కోత విధించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పెనుప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే తమ ఉద్యోగులకు శాలరీని పెంచాయి. సగటున శాలరీ ఇంక్రిమెంట్ గత ఏడాది 8.6 శాతంగా ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతానికి క్షీణిస్తుందని ఓ సర్వే అంచనా వేసింది. ప్రముఖ కన్సల్టెన్సీ డెలాయిట్ టచ్ తోహమత్సు ఇండియా ఎల్ఎల్‌పీ కరోనా మహమ్మారి ప్రభావం, వేతనాలపై సర్వే నిర్వహించింది.

అందుకే వారికి వేతనం భారీగా పెరిగింది
కరోనా మహమ్మారి ప్రభావం మార్చి చివరి నెల నుండి ప్రారంభమైంది. దీంతో అంతకుముందే వేతనాలు పెంచిన సంస్థలకు చెందిన ఉద్యోగులకు మంచి శాలరీ ఇంక్రిమెంట్ లభించింది. లాక్ డౌన్‌కు ముందే పెంచడంతో వేతన పెరుగుదల శాతం ఎక్కువగా ఉంది. అయితే ఆ తర్వాత చాలా కంపెనీలు వేతనాలు పెంచలేదు. 20 శాతానికి పైగా ఆదాయం తగ్గుతుందని భావిస్తున్న కంపెనీలు అతి తక్కువ ఇంక్రిమెంట్ ఇచ్చినట్లు సోమవారం నాటి సర్వే వివరాల్లో తెలిపింది.

ఇంక్రిమెంట్లు ఇవ్వకూడదని నిర్ణయం
2020 వర్క్ ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్ ట్రెండ్స్ పేరుతో చేసిన ఈ సర్వేలో 350కి పైగా సంస్థలు పాల్గొన్నాయి. ఈ సర్వే ప్రకారం దేశంలోని ప్రతి 10 కంపెనీల్లో కేవలం 4 మాత్రమే ఈసారి ఇంక్రిమెంట్స్ ఇచ్చాయి. 33 శాతం కంపెనీలు ఇంక్రిమెంట్ ఇవ్వకూడదని నిర్ణయించగా, మరికొన్ని సంస్థలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో సగటు వేతన పెంపు 3.6 శాతంగా ఉంది. దశాబ్ద కాలంలో ఇదే అత్యల్పం. 2019లో ఇది 8.6 శాతంగా ఉంది.

వేతనాలు ఇచ్చిన సంస్థలు తీసుకున్నా..
ఇంక్రిమెంట్స్ ఇచ్చిన సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 2020లో సగటు ఇంక్రిమెంట్ 7.5 శాతంగా ఉంది. 10 శాతం కంటే తక్కువ కంపెనీలు 10 శాతం కంటే ఎక్కువ వేతన పెంపును అమలు చేశాయి. మార్చి 2020 నుండి వేతనాలు పెంచే సంస్థలు భారీగా పడిపోయాయి.
కరోనా కారణంగా మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల పాటు ఇది కొనసాగడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. జూన్ రెండో వారం నుండి ఆంక్షలు ఎత్తివేశారు. కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న వివిధ నగరాల్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా, తదనంతర లాక్ డౌన్ పరిణామాలు ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటోంది.


Click it and Unblock the Notifications