Upper Circuit: 2 రోజుల్లో 44 శాతం పెరిగిన స్టాక్.. మీ పోర్ట్‌ఫోలియోలో ఉంటే లక్కే..!
Avalon Technologies: దేశీయ స్టాక్ మార్కెట్లు గత రెండు వారాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు దేశీయంగా కార్పొరేట్ కంపెనీలు తమ ఫలితాలను కూడా ప్రకటించటంతో కొన్ని స్టాక్స్ భారీగా క్షీణతను చూస్తున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో పేలవమైన కంపెనీల పనితీరు ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురిచేస్తున్నట్లు కొన్ని పరిణామాలను చూస్తే తెలుస్తోంది. అయితే మరికొన్ని మాత్రం తళుక్కును మెరుస్తున్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్టాక్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అవలోన్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ల గురించే. గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు ఏకంగా 44 శాతం భారీ పెరుగుదలను చూశాయి. దీంతో కంపెనీ షేర్లు శుక్రవారం ఇంట్రాడేలో సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరాయి. దీనికి అసలు కారణం కంపెనీ ఇటీవల ప్రకటించిన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల గురించే. ఫలితాల విడుదల ముందే కొన్ని ట్రేడింగ్ సెషన్ల నుంచి కంపెనీ షేర్లు పెరుగుదలను నమోదు చేయటంతో ప్రస్తుతం షేర్లు హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు సంతోషంలో మునిగిపోయారు.

ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు భారీగా ఎగబడటంతో అవలోన్ టెక్నాలజీస్ రెండు ట్రేడింగ్ సెషన్లలో అప్పర్ సర్క్యూట్ తాకాయి. వరుస అప్పర్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం మార్కెట్లలో షేర్లు ఒక్కోటి రూ.849.45 స్థాయికి చేరుకున్నాయి. జూలై-సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించిన కంపెనీ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ విడుదల చేసిన ఫలితాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన నికర లాభం 140 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.17.48 కోట్లుగా నివేదించబడింది. గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.7.28 కోట్లుగా ప్రకటించబడిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ త్రైమాసికంలో అవలోన్ టెక్నాలజీస్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 36.80 శాతం పెరిగి రూ.275.02 కోట్లుగా నమోదైంది. అలాగే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.200.99 కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ రూ.1,490 కోట్ల ఆర్డర్ బుక్ కలిగి ఉంది. 2023 ఏప్రిల్ నెలలో కంపెనీ షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో ఒక్కో షేరును అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధర రూ.436 వద్ద విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో స్టాక్ ధరను చూస్తే దాదాపుగా 100 శాతం రాబడిని అందించింది.
కంపెనీ వ్యాపారం..
బాక్స్ బిల్డ్ సొల్యూషన్‌లను అందించడంలో కంపెనీ దేశంలోనే ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీగా ఉంది. కంపెనీ అధిక విలువ కలిగిన ఖచ్చితమైన ఇంజనీరింగ్ ఉత్పత్తులపై దృష్టి సారిస్తుంది. కంపెనీ క్లయింట్ సర్వీసింగ్ మోడల్ ద్వారా తమ కస్టమర్లతో సుదీర్ఘ సంబంధాలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications