అమెరికాకు చెందిన ఔషధ కంపెనీ ప్రొఫెక్టస్ బయోసైన్సెస్ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన కొన్ని ఆస్తులను దేశీయ ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా సొంతం చేసుకోనుంది. దీనికోసం అమెరికాలోని అరబిందో ఫార్మా ఇన్‌కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన ఆరో వ్యాక్సిన్స్ ఎల్ఎల్‌సీ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం.. క్లినికల్ స్థాయి వరకూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రొఫెక్టస్ బయోసైన్సెస్ ఇన్‌కార్పొరేషన్ పరిశోధన, అభివృద్ధి విభాగానికి చెందిన ఆస్తులు అరబిందో కొనుగోలు చేయనుంది. దీనికోసం దశల వారీగా 11.29 మిలియన్ డాలర్లను అరబిందో చెల్లించనుంది. దీనివల్ల కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి విషయంలో అరబిందో సామర్థ్యం మరింత పెరుగుతుంది.

చైనాలో ఇంజక్టబుల్స్ ప్లాంట్ ఏర్పాటు...
వచ్చే మూడేళ్ల నుంచి ఐదేళ్ల వ్యవధిలో చైనా మార్కెట్‌లో ఇన్‌హేలర్లు, ఓరల్ ఔషధాలు, ఇంజెక్టబుల్స్ ప్రవేశపెట్టాలని అరబిందో ఫార్మా యోచిస్తోంది. దీనికోసం చైనాలో ఇంజెక్టబుల్స్ తయారీ కోసం కొత్తగా ప్లాంట్ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి చైనాలో ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చే వీలుంది.
ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో విక్రయించేందుకు అవసరమైన ఇంజెక్టబుల్స్‌ను తన యూనిట్ 4లో అరబిందో తయారు చేస్తోంది. అమెరికాలో కంపెనీకి చెందిన 'ఆరోమెడిక్స్' ఈ ఇంజెక్టబుల్స్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తోంది. అమెరికా మార్కెట్లో ఇంజెక్టబుల్స్ ద్వారా అరబిందో ఫార్మాకు లభించిన ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే 49 శాతం పెరిగి 7.5 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.525 కోట్లు) చేరింది.
ఇక చైనాలో ఏర్పాటు చేసే యూనిట్‌లో తయారయ్యే ఇంజెక్టబుల్స్‌ను యూరోప్, ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయాలని అరబిందో భావిస్తోంది. దీనికోసం అవసరమయ్యే అనుమతులను ఆయా మార్కెట్ల రెగ్యులేటర్ల నుంచి ఈ యూనిట్ పొందుతుందని అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇన్‌హేలర్ల తయారీ కోసం ఇప్పటికే చైనాలో ఏర్పాటు చేసిన సంయుక్త ప్లాంటులో అరబిందో ఫార్మాకు 30 శాతం వాటా ఉంది.


Click it and Unblock the Notifications