ATMలలో డబ్బులు అయిపోయాయా? చిన్న నగరాల్లో క్యాష్ కష్టాలు.. RBI ఏం చెప్పిందంటే?
ఈ మధ్య కాలంలో మీరు మీ ఊర్లో లేదా చిన్న చిన్న టౌన్లలో ఏటీఎం (ATM) నుంచి డబ్బులు తీయడానికి వెళ్ళినప్పుడు 'నో క్యాష్' అనే బోర్డులు చూశారా? అవును, ప్రస్తుతం దేశంలోని చిన్న నగరాలు, పట్టణాల్లో కొన్ని ATM లలో నగదు కొరత సమస్య తలెత్తుతోంది. దీనిపై ఏటీఎం ఆపరేటర్ల ప్రతినిధి సంస్థ 'కాట్మి' (CATMi) ఆర్‌బీఐ దృష్టికి కొన్ని కీలక విషయాలను తీసుకెళ్లింది. అసలు దేశంలో కరెన్సీ కొరత ఉందా? లేక బ్యాంకులు చేస్తున్న పొరపాటా? సామాన్య ప్రజలపై దీని ప్రభావం ఎంత ఉంటుంది? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మెట్రోలకే ఎక్కువ డబ్బులు.. చిన్న ఊర్లకు మొండిచేయా?
మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి దేశవ్యాప్తంగా దాదాపు 65,000 ఏటీఎంలు ఉన్నాయి. అయితే, ఎస్బీఐ తన ఏటీఎంలలో సగానికి పైగా మెట్రో సిటీలలో (Tier-1) ఉన్న వాటికే ఎక్కువ నగదును పంపిణీ చేస్తోందట. దీనివల్ల చిన్న పట్టణాలు (Tier-2, Tier-3) లలో ఉండే ఏటీఎంలకు తగినంత నగదు అందడం లేదు. ఏటీఎం కంపెనీల సీఈఓల ప్రకారం.. మిగతా బ్యాంకులు ఈ సమస్యను మేనేజ్ చేస్తున్నప్పటికీ, ఎస్బీఐ మాత్రం ఈ విషయంలో వెనుకబడిపోయింది.
పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, గత నవంబర్ 2025 లో ఏటీఎంలకు కావాల్సిన క్యాష్ లో 80 శాతం సరఫరా జరిగితే, అది ఏప్రిల్ 2026 నాటికి కేవలం 57 శాతానికి పడిపోయింది. దీనివల్ల ఏటీఎంలు మూతపడి తమకు భారీగా నష్టాలు వస్తున్నాయని, బ్యాంకింగ్ రంగం తమకు రూ. 100 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కాట్మి డిమాండ్ చేస్తోంది.
దేశంలో డబ్బుల్లేవా? ఆర్‌బీఐ గవర్నర్ ఏమంటున్నారు?
నిజానికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ (Currency in circulation) చాలా ఎక్కువగానే ఉంది. మే 29, 2026 నాటికి దేశంలో రూ. 42.56 లక్షల కోట్లకు పైగా కరెన్సీ అందుబాటులో ఉంది, ఇది గతేడాది కంటే 12 శాతం ఎక్కువ. మరి సమస్య ఎక్కడ వస్తోంది? కేవలం ఆయా ఏటీఎం కేంద్రాలకు నగదును చేరవేయడంలోనే లోపం జరుగుతోంది.
దీనిపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందిస్తూ.. "మా దగ్గర సరిపడా కరెన్సీ నిల్వలు ఉన్నాయి. ఎక్కడైనా కొరత ఉంటే, వెంటనే ఏటీఎంలను, బ్యాంక్ బ్రాంచ్‌లను క్యాష్‌తో నింపడానికి అన్ని చర్యలు తీసుకుంటాం" అని జూన్ 5 నాటి మానిటరీ పాలసీ మీటింగ్‌లో హామీ ఇచ్చారు.
ఏటీఎంల వాడకం భారీగా తగ్గిపోయింది!
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో యూపీఐ (UPI) వంటి డిజిటల్ పేమెంట్స్ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో, ఏటీఎంల నుండి డబ్బులు తీసే వారి సంఖ్య బాగా తగ్గింది. జనవరి 2023 లో నెలకు 57 కోట్లుగా ఉన్న ఏటీఎం లావాదేవీలు, సెప్టెంబర్ 2025 నాటికి 44 కోట్లకు పడిపోయాయి. ఒకపక్క లావాదేవీలు తగ్గి ఆదాయం రాకపోవడం, మరోపక్క పెట్రోల్ ధరలు, సిబ్బంది జీతాలు పెరగడంతో ఏటీఎంలు నిర్వహించడం భారంగా మారిందని కంపెనీలు చెప్తున్నాయి.
కస్టమర్లపై ప్రభావం ఎంత?
ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా ఏటీఎంలు పూర్తిగా బంద్ అయిపోయే ప్రమాదం ఏమీ లేదు. చిన్న టౌన్లలో ఉండే వారు కొన్నిసార్లు టెక్నికల్ లేదా క్యాష్ సమస్యల వల్ల ఇబ్బంది పడాల్సి రావచ్చు కానీ, అధికారికంగా సర్వీసులు తగ్గించే ఆలోచన లేదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు


Click it and Unblock the Notifications