Electric Vehicles: ఎలక్ట్రిక్ స్కూటర్‌పై Xలో ఫిర్యాదు.. కంపెనీ రిప్లైతో యూజర్ మైండ్ బ్లాక్..
Ather e-sctooer: సాంప్రదాయ డీజిల్, పెట్రోల్ వాహనాల నుంచి భారత్ క్రమంగా ఎలక్ట్రిక్, CNG, హైడ్రోజన్ ఇంధనాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం కూడా గ్రీన్ ఎకానమీలో భాగంగా దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అయితే అడపాదడపా జరుగుతున్న సంఘటనలు.. కొత్త సాంకేతికతతో అందుబాటులోకి వచ్చిన వాహనాలను కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచింపచేస్తున్నాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు జనాదరణ పొందుతున్నాయి. ధర, పర్యావరణ అనుకూలత మరియు సౌలభ్యం కారణంగా చాలా మంది వాటిని ఎంచుకుంటున్నారు. అయితే ఇటీవల వాటిలో మంటలు చెలరేగడం, కొద్దిపాటి వర్షాల సమయంలో మొరాయించడం వంటి సంఘటనల వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా అకస్మాత్తుగా సాఫ్ట్ వేర్ అప్‌డేట్ కావడంతో ఓ వ్యక్తి సమయానికి ఆఫీసుకు చేరుకోలేకపోయినట్లు Xలో చెప్పుకొచ్చారు.

Xలో పోస్ట్ ప్రకారం.. ప్రతీక్ రాయ్ అనే వినియోగదారుడు తన ఇ-స్కూటర్‌ని ఉపయోగించి రోజులాగే కార్యాలయానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. వాహనాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు, స్క్రీన్ మీద అప్‌డేట్ ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు గమనించాడు. అదికాస్తా పూర్తయ్యే సరికి కొంత సమయం తీసుకోవడంతో, ఆఫీసుకు ఆలస్యంగా చేరుకోవాల్సి వచ్చింది.
'ఇది చాలా కొత్త సమస్య. నేను ఉదయం బైక్ ఆన్ చేసినప్పుడు నా ఏథర్ వాహనం అప్‌డేట్ అవడం ప్రారంభించింది. బండి ముందుకు కదలలేక, ఆఫీసుకు వెళ్లలేకపోయాను. స్కూటర్ అప్‌డేట్ అవుతున్నందున ఆఫీసుకి ఆలస్యంగా వెళ్లాను' అని తన పోస్ట్‌లో తెలిపారు. అయితే ఏథర్ కంపెనీ ఆ పోస్టుపై స్పందిస్తూ.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ షెడ్యూల్ చేయడానికి ఓ ఆప్షన్ ఉంటుంది. ముందుగా మీ వాహనం గురించి తెలుసుకోండి' అని రిప్లై ఇచ్చింది. దీనిపై యూజర్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications