GDP News: జీడీపీ వృద్ధి అంచనాలు పెంచిన ADB.. గతంలో ఎంతంటే..
GDP Growth: ప్రపంచం దృష్టి ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థపైనే ఉంది. ప్రధాని మోదీ సైతం భారత్ ఎవ్వరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతోందని అన్నారు. తాజాగా జీడీపీ వృద్ధి అంచనాలు ఏమని చెబుతున్నాయో తెలుసుకుందాం..
ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ADB) గురువారం భారతదేశానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 జీడీపీవృద్ధి రేటు అంచనాను 7 శాతానికి పెంచింది. అంతకుముందు వృద్ధి రేటు 6.7 శాతంగా అంచనా వేయబడింది. దేశంలో ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులతో పాటు వినియోగదారుల డిమాండ్ బలమైన వృద్ధికి మార్గం సుగమం చేస్తుందన్నారు. ఆసియా పసిఫిక్‌లలో భారతదేశం "ప్రధాన వృద్ధి ఇంజిన్"గా కొనసాగుతుందని ADB తన 'ఆసియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్' ఏప్రిల్ ఎడిషన్‌లో పేర్కొంది.

2025-26 ఆర్థిక సంవత్సరానికి ADB భారతదేశ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేసింది. FY2023-24, FY2024-25లో మందగమనం ఉన్నప్పటికీ, వృద్ధి బలంగానే ఉంటుందని పేర్కొంది. అయితే FY2024-25 వృద్ధి అంచనా 2022-23 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 7.6 శాతం కంటే తక్కువగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.7 శాతంగా ఉంటుందని మనీలాకు చెందిన బహుపాక్షిక సంస్థ గతేడాది డిసెంబర్‌లో అంచనా వేసింది. ద్రవ్యోల్బణంలో తగ్గుదల ధోరణి ప్రపంచ ట్రెండ్‌లకు అనుగుణంగా కొనసాగుతుందని పేర్కొంది.
సాధారణ రుతుపవనాలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుదల, తయారీ & సేవా రంగాలలో నిరంతర వృద్ధి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం ద్రవ్యపరపతి సమావేశం తర్వాత వెల్లడించిన సంగతి తెలిసిందే.
"గ్లోబల్ హెడ్‌విండ్‌లు ఉన్నప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, సహాయక విధానాల ద్వారా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది" అని భారతదేశానికి ADB కంట్రీ డైరెక్టర్ మియో ఓకా అన్నారు. 1966లో స్థాపించబడిన ఏడీబీ బ్యాంకు తీవ్రమైన పేదరిక నిర్మూలనకు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.


Click it and Unblock the Notifications