Stock Market: శుక్రవారం మార్కెట్ సెషన్లో హిందుజా గ్రూపుకు చెందిన అశోక్ లేలాండ్ షేర్లు దాదాపు 2 శాతం ర్యాలీ తీశాయి. వచ్చే వారమూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి కారణం గుజరాత్ ప్రభుత్వం అని తెలుస్తోంది. అక్కడి గవర్నమెంట్ తీసుకున్న ఓ నిర్ణయం కంపెనీకి లాభాల పంట పండించనుందని చెప్పుకోవచ్చు.
దేశంలో రెండో అతిపెద్ద వాహన తయారీదారుగా అశోక్ లేలాండ్ కు పేరుంది. ఇదికాక మార్కెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతో గుజరాత్ ప్రభుత్వం తలపెట్టిన ఓ ప్రాజెక్టు నుంచి భారీ డీల్ చేజిక్కించుకుంది. ఏకంగా 1,282 బస్సుల కోసం ఆర్డర్ సొంతం చేసుకుంది. ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది.

ప్రజా రవాణాలో ఉపయోగించేందుకు గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అశోక్ లేలాండ్ కు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఒప్పదం ప్రకారం 55 సీట్లతో కూడిన పూర్తి అసెంబుల్డ్ BS VI డీజిల్ బస్సులను అశోక్ లేలాండ్ దశల వారీగా డెలివరీ చేయాల్సి ఉంటుంది.
'ఓ రాష్ట్ర రవాణా సంస్థ నుంచి ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఆర్డర్స్ లో ఇదొకటి. భారతీయ బస్ మార్కెట్లో మా ఆధిపత్య స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ డీల్ దోహదం చేస్తుంది' అని కంపెనీ ప్రకటించింది. 'మన్నిక, పటిష్ఠత, అత్యాధునిక సాంకేతికతకు మా బస్సులు ప్రసిద్ధి. ఇవే ప్రభుత్వ, ప్రైవేట్ కస్టమర్లు మమ్మల్లి ఇష్టపడేలా చేస్తున్నాయి. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గర్వపడుతున్నాం' అని MD&CEO షేను అగర్వాల్ తెలిపారు.
గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (GSRTC)తో అశోక్ లేలాండ్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ప్రస్తుతం GSRTC నడుపుతున్న 2 వేల 600 కంటే ఎక్కువ బస్సులను ఈ కంపెనీనే తయారుచేసింది. ఇక తాజాగా కుదిరిన ఒప్పందాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే.. ఈ సంఖ్య కాస్తా దాదాపు 4 వేలకు చేరనుంది.


Click it and Unblock the Notifications