పన్ను విధానంపై అష్నీర్ గ్రోవర్ విమర్శలు.. ఏడాదిలో 5 నెలలు ప్రభుత్వం కోసమే..
Ashneer Grover: కేంద్ర ప్రభుత్వంపై భారత్ పే మాజీ MD అష్నీర్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పన్ను విధానాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇక్కడ పన్నులు చెల్లించడం ఓ శిక్ష వంటిదని అభిప్రాయపడ్డారు. వేతన జీవుల ఆదాయంపై ఎటువంటి స్పష్టమైన ప్రయోజనాలు లేకుండా దాదాపు 40 శాతం వరకు ట్యాక్స్ విధించడాన్ని తప్పుపట్టారు.
"భారతదేశంలో పన్నుల వ్యవస్థ తారుమారైంది. పన్ను చెల్లింపుదారులు దానధర్మాలు చేస్తున్నారు. వారికి ఎలాంటి ప్రయోజనాలు లభించడం లేదు" అని గ్రోవర్ వ్యాఖ్యానించిన ఓ వీడియో వైరల్ అయింది. "10 రూపాయలు సంపాదిస్తే అందులో 4 రూపాయలు ప్రభుత్వానికి వెళ్తుందంటే, ఏడాదిలో 5 నెలలు మనం ప్రభుత్వం కోసం పనిచేస్తున్నట్లేనన్నారు. అంటే జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి బానిసగా ఉండాలో ఆలోచించండి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంటర్‌ప్రెన్యూర్స్ దీనిని అర్థం చేసుకున్నందున వారు పన్నులు చెల్లించరని గ్రోవర్ తెలిపారు. అయితే జీతం పొందే ఉద్యోగుల కోసం ఎటువంటి ఎంపికలు లేకపోవడం బాధాకరమన్నారు. ఎందుకంటే వారు నేరుగా TDS కింద సోర్స్ వద్దే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందన్నారు. దీనిపైన అదనంగా 18 శాతం GST సైతం విధిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక శిక్ష వంటిదని, చివరికి ఎవరికోసం జీవిస్తున్నామో ఆలోచించాలన్నారు.
తాను రాజకీయ నాయకుడు అయితే దేశంలో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడానికి ప్రయత్నిస్తానని తన ఉద్దేశ్యాన్ని మరొక వైరల్ వీడియోలో గ్రోవార్ వెల్లడించారు. పన్ను రేటును అందరికీ ఏకరీతిగా 10-15 శాతంగా నిర్ణయించి, ఎగవేతలను నిరోధించేందుకు కఠిన చర్యలు అమలు చేస్తానన్నారు. తద్వారా ప్రభుత్వం అంతిమంగా అధిక పన్ను ఆదాయాన్ని ఆర్జిస్తుంది అని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications