హైదరాబాద్ సహా... ఓయోకు 700 హోటల్స్ షాక్, కారణాలివేనా?
న్యూఢిల్లీ: ఓయోకు హోటల్స్ షాకిస్తున్నాయట. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇటీవలి వరకు దేశంలోని దాదాపు 500 హోటల్స్ హాస్పిటాలిటీ చైన్ ఓయోకు దూరమైనట్లుగా భారత హోటల్, రెస్టారెంట్ సంఘం గౌరవ కార్యదర్శి ప్రదీప్ షెట్టి అన్నారు. ఓటో కాంట్రాక్ట్ ఉల్లంఘనలకు పాల్పడుతుండటమే కాకుండా కనీస హామీ మొత్తాలను చెల్లించడం లేదని, లీగల్ నోటీసులు అంటూ బెదిరింపులకు పాల్పడుతోందని పలు హోటల్స్ ఆరోపించాయి.

100 నగరాల్లో 500కు పైగా హోటల్స్ ఔట్
అంతేకాకుండా ఆ హోటల్స్‌లోని గదులు ఓయో పైన బుక్ అయినట్లుగా చూపిస్తూ ఉండటంతో తాము ఆన్ లైన్ ద్వారా లిస్టింగ్ చేయలేకపోతున్నామని, ఇది తమ వ్యాపారాలను దెబ్బతీస్తోందని హోటల్స్ ఆరోపిస్తున్నాయి. దీంతో 100 నగరాల్లోని 500కు పైగా హోటల్స్ ఓయోతో తెగతెంపులు చేసుకున్నాయట. తమ సమస్యలను అందరి దృష్టికి తెస్తూ నిరసనలు కూడా నిర్వహించినట్లు చెప్పారు.

ఫిర్యాదులు
ఏప్రిల్ నెల నుంచి దాదాపు 500 నుంచి 700 వరకు హోటల్స్ ఓయో నుంచి బయటకు వచ్చినట్లుగా అంచనా వేస్తున్నామని ప్రదీప్ షెట్టి అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) కూడా ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)కు కంప్లయింట్ చేసింది. దీనిపై విచారణ సాగుతోంది.

హైదరాబాద్ సహా పలు నగరాల్లో...
బెంగళూరు, గోవా, గురుగ్రామ్, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడా, పుణేలలోని పలు హోటల్స్ ఓయో నుంచి వెలుపలికి వచ్చాయని తెలుస్తోంది. మరోవైపు, తమపై వచ్చిన ఆరోపణలు సరికాదని, అవి పూర్తి అబద్దమని ఓయో తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. నాణ్యత సమస్య కారణంగా తామే కొన్ని హోటల్స్ నుంచి దూరం జరిగినట్లు ఓయో అధికార ప్రతినిధి చెప్పారు.


Click it and Unblock the Notifications