Banking Alert: ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది బ్యాంకింగ్ కస్టమర్లు తమ ఖాతాల నుంచి డబ్బును నష్టపోతున్నారు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే అకౌంట్ల నుంచి డబ్బు మాయం కావటంపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సైతం సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. చాలా మంది అకౌంట్ హోల్డర్లు తమ సేవింగ్స్ అకౌంట్ల నుంచి రూ.236 డెబిట్ చేయబడినట్లు మెసేజ్ అందుకోవటంతో ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. దేశంలో అత్యధికంగా ఖాతాదారులను కలిగిన బ్యాంక్ గా ఈ ప్రభుత్వ యాజమాన్యంలోని దిగ్గజం కొనసాగుతోంది. యోనో యాప్ ద్వారా మెుబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న కంపెనీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచింది.

ఒక్కసారి కస్టమర్లు తమ ఎస్బీఐ పాస్ బుక్ గమనించినట్లయితే కాలానుగుణంగా అకౌంట్ల నుంచి రూ.236 కోల్పోతున్నట్లు మెసేజ్ అందులో ఉంటుంది. దీనిని చూసిన వెంటనే ఇకపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకిలా జరుగుతోందనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే బ్యాంక్ తన కస్టమర్ల నుంచి వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు, సర్వీస్ ఫీజు లేదా ఏటీఎం కార్డు వార్షిక ఛార్జీల కింద వసూళ్లు చేస్తున్నట్లు తేలింది.
బ్యాంక్ ముందుగా తన ఖాతాదారుల నుంచి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల రూపంలో రూ.200 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై 18 శాతం జీఎస్టీ కలుపుకుంటే ఇది మెుత్తంగా రూ.236కి చేరుకుంటుంది. అందువల్ల ఇకపై మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా బ్యాంకు శాఖను సందర్శించి వివరణ పొందాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా బ్యాంక్ ఈ ఛార్జీలను వసూలు చేస్తూనే ఉంటుంది. అయితే ఈ క్రమంలో కస్టమర్లకు అందించిన వివిధ కార్డులకు ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి.
కార్డు జారీ చేసిన తర్వాతి సంవత్సరం నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న వివిధ ఛార్జీలను పరిశీలిస్తే..
- క్లాసిక్/సిల్వర్/గ్లోబల్ కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డుల ఛార్జీ- 200+జీఎస్టీ 18 శాతం
- యువ/గోల్డ్/కాంబో/మైకార్డ్ ఇమేజ్ డెబిట్ కార్డులకు ఛార్జీలు- 250+జీఎస్టీ 18 శాతం
- ప్లాటినం డెబిట్ కార్డ్- 325+జీఎస్టీ 18 శాతం
- ప్లాటినం బిజినెస్ రూపే కార్డ్- 350+జీఎస్టీ 18 శాతం
- ప్రైడ్/ప్రీమియం బడ్జెట్ డెబిట్ కార్డ్- 425+జీఎస్టీ 18 శాతం వసూలు చేస్తోంది.


Click it and Unblock the Notifications