AR Dairy Scam: ప్రపంచ ప్రఖ్యాతగాంచిన తిరుమల వెంకన్న ప్రసాదం అయిన లడ్డు తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారం దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ముందుకు వెళ్లింది. దీనిలో నిజానిజాలు తేల్చేందుకు కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆహ్వానించారు. అసలు ఈ వ్యవహారంలో తేల్చటానికి ఏమీ లేదని మాజీ సీఎం జగన్ ఒకపక్క చెబుతుంటే మరోపక్క విస్తుగొల్పే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
అయితే ఏఆర్ డెయిరీ వ్యవహారంలో కమర్షియల్ టాక్స్ అధికారులు ఇచ్చిన ఒక నివేదిక సంచలనంగా మారిపోయింది. తిరుమలలో స్వామివారి లడ్డూ తయారీకి తక్కువ రేటు కోట్ చేసి టెండర్ దక్కించుకున్న ఏఆర్ డెయిరీ వైష్ణవి డెయిరీ, బోలే బాబా డెయిరీ నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను అధికారులు సేకరించారు. ఈ క్రమంలో టాక్స్ అధికారులు వే బిల్లులు, జీఎస్టీ రసీదులు, టోల్ గేట్‌ల నుంచి ఆధారాలు కలెక్ట్ చేశారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే సదరు డెయిరీల నుంచి కొనుగోలు చేసిన వాస్తవ రేటు కంటే తక్కువకే టీటీడికి ఏఆర్ డెయిరీ సరఫరా చేయటమే.

టీటీడికి కేజీ నెయ్యిని రూ.318 చొప్పున అందించేందుకు ఏఆర్ డెయిరీ టెండర్ దక్కించుకుంది. అయితే సదరు నెయ్యిన బోలేబాబా, వైష్ణవీ డెయిరీల నుంచి కేజీకి రూ.355 చెల్లించి కొనుగోలు చేసినట్లు టాక్స్ అధికారుల నివేదిక ప్రకారం వెల్లడైంది. పైగా బోలేబాబా, వైష్ణవి డెయిరీల డైరెక్టర్ కూడా ఒక్కరే కావటంతో అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక్కడ నష్టానికి ఏఆర్ డెయిరీ వ్యాపారం చేసిందా లేక నిజంగానే కల్తీ జరిగిందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అధికార పార్టీ నేతలు మాత్రం కల్తీ చేయకుండా ఇలా తక్కువ రేటుకు సరఫరా ఎలా కుదిరుతుందని వాదిస్తున్నారు. ఏ వ్యాపారి అయినా నష్టం కోసం వ్యాపారం చేయరని, అలా నష్టం వాటిల్లినప్పుడు టెండర్ వదులుకుంటుంటారని వారు అంటున్నారు. అసలు ఇలా ఎందుకు చేయాల్సి వంచిందనే వ్యవహారంపై అధికారులు సంస్థ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి గతంలో టెండర్ల ధర కంటే తక్కువకు నెయ్యిని జగన్ సర్కార్ ఎలా కొనుగోలు చేయగలిగిందనే అనుమానంతో అసలు కల్తీ వ్యవహారం బయటకు వచ్చింది. ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన మెుత్తం నాలుగు ట్యాంకర్లలో 2 తిరిగి పంపబడ్డాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం వెంకన్న విషయంలో తామేమి తప్పిదాలు చేయలేదని, తమ హయాంలో నెయ్యి సరఫరా జరిగినప్పుడు పూర్తిగా టెస్ట్ చేశాకే వినియోగానికి అనుమతించామని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications