Foxconn: ఒకప్పుడు ఐఫోన్ తయారీ మెుత్తం చైనా కేంద్రంగా జరిగేది. అయితే కరోనా తర్వాత కంపెనీలు ఒక్కొక్కటిగా చైనాకు దూరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రఖ్యాత తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్ ఇండియాలో తన యూనిట్ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది.
తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ భారతదేశంలో టెక్ హబ్ గా కొనసాగుతున్న బెంగళూరు శివార్లలో కొత్తగా భూమిని కొనుగోలు చేసింది. చైనా నుంచి తన ఆపిల్ ఉత్పత్తి కేంద్రాలను విస్తరించాలని చూస్తున్నందున ఈ అభివృద్ధి చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ప్రధాన అసెంబ్లర్ గా కొనసాగుతోంది.

బెంగళూరు శివారులో విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు వెల్లడించింది. ఈ సైట్ కొనుగోలు కోసం అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్ హాన్ హై టెక్నాలజీ ఇండియా మూడు బిలియన్ రూపాయలను చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో మరో ఫాక్స్‌కాన్ యూనిట్ వియత్నాంలోని న్ఘే ఆన్ ప్రావిన్స్‌లో 4,80,000 చదరపు మీటర్ల స్థలంలో స్థాపించేందుకు భూ వినియోగ హక్కులను కంపెనీ పొందుతోంది.
ఆపిల్ ఉత్పత్తుల అసెంబ్లింగ్ ప్లాంట్ త్వరలో రానున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇటీవల ప్రకటించారు. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 1,00,000 ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఫాక్స్ కాన్ దాదాపు 700 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని చూస్తోందని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు "భాగస్వామ్యాలను మరింతగా పెంచుకోవడానికి.. సెమీకండక్టర్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రిక్ వాహనాల వంటి కొత్త రంగాల్లో సహకారం కోసం" కర్ణాటకను సందర్శించారు.


Click it and Unblock the Notifications