GPS: ఈ రోజుల్లో ఇల్లు కదలాలంటే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే, అందులో గూగుల్ మ్యాప్స్ వినియోగించాల్సిందే. ప్రయాణాల నుంచి ఫుడ్ ఆర్డరింగ్ వరకు నావిగేషన్ కు గాను ఈ GPS సాంకేతికత తప్పనిసరి అయిపోయింది. ఈ అమెరికా టెక్నాలజీకి బదులు భారత్ రూపొందించిన కొత్త సాంకేతికత ఇప్పుడు మొబైల్స్ లో కనిపించనుంది.
పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ సేవల్ని అందిస్తున్న GPSకు ప్రత్యామ్నాయంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 'నావిక్'ను తయారు చేసింది. భూమి, ఆకాశం, సముద్రంతో పాటు సర్వే, పరిశోధన, లొకేషన్ మొదలైన అన్ని అవసరాల కోసం ఇది సేవలు అందిస్తుంది. ఇందుకోసం 2018లో 7 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది.

నావిక్ అప్లికేషన్ సపోర్ట్ చేసే విధంగా స్మార్ట్ ఫోన్లు తీసుకురావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొంతకాలంగా శామ్‌సంగ్, ఆపిల్ వంటి దిగ్గజ మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలను కోరుతోంది. కాగా ఈ సాంకేతికత ఇప్పుడు ఆపిల్ ఐఫోన్ 15 ద్వారా మొదటిసారిగా ప్రజలకు విరివిగా అందుబాటులోకి రానుంది.
భారత సరిహద్దులను దాటి 1,500 కిలోమీటర్ల ప్రాంతాన్ని నావిక్ కవర్ చేస్తుంది. దీని సిగ్నల్స్ అత్యంత ఖచ్చితంగా ఉంటాయని ఇస్రో చెబుతోంది. 20 మీటర్ల లోపే వినియోగదారుడి లొకేషన్, 50 నానోసెకన్ల కంటే మెరుగైన టైమింగ్ యాక్యురసీ దీని సొంతమని పేర్కొంది.
1999 కార్గిల్ యుద్ధ సమయంలో GPS డేటాను భారత సైన్యానికి అందించేందుకు అమెరికా నిరాకరించింది. తద్వారా క్లిష్టమైన సమాచారం అందకుండా అడ్డుకుంది. భవిష్యత్తులో ఈ తరహా పరిస్థితులు తలెత్తితే ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా నిర్ణయించింది. 2006లో ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


Click it and Unblock the Notifications