భారీగా తగ్గిన యాపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం, కారణం ఇదే!
శాన్‌ఫ్రాన్సిస్కో: యాపిల్ సీఈవో టిమ్ కుక్ వార్షిక వేతనం 2019లో తగ్గింది. 2018లో 15.7 మిలియన్ డాలర్లు అందుకున్న ఆయన గత ఏడాది (2019)లో మాత్రం 11.6 మిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఆయన ఆదాయం తగ్గడానికి యాపిల్ పని తీరు, ఐఫోన్ సేల్స్ 2019లో పడిపోవడమే కారణంగా తెలుస్తోంది.

ఇందుకే టిమ్ కుక్ ఆదాయం తగ్గింది
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వద్ద లభ్యమవుతున్న సమాచారం మేరకు గత ఏడాది యాపిల్ అమ్మకాలు లక్ష్యానికి మించి కేవలం 28 శాతం మాత్రమే పెరిగాయి. అంతకుముందు ఏడాది (2018)లో మాత్రం లక్ష్యానికి మించి 100 శాతం అమ్మకాలను నమోదు చేసింది. దీంతో 2019లో ప్రోత్సాహక బోనస్ కింద 12 మిలియన్ డాలర్లు రాగా, 2019లో ఇది 7.7 మిలియన్ డాలర్లకు తగ్గింది. ఇదే టిమ్ కుక్ వేతనంపై ప్రభావం పడింది.

8 శాతం తగ్గిన పారితోషికం
2019లో టిమ్ కుక్‌కు కంపెనీ పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల చెల్లింపులు 0.77 కోట్ల డాలర్లకు పడిపోయాయి. 2019లో టిమ్ కుక్ పేలో 8,85,000 డాలర్ల బెనిఫిట్స్‌లో ఎక్కువగా సెక్యూరిటీ, ప్రయివేటు జెట్‌కు సంబంధించినవే. టిమ్ కుక్ మెజార్టీ పే 113.5 మిలియన్ డాలర్ల విలువ కలిగిన యాపిల్ షేర్ నుంచి వచ్చినవి. బోనస్, వెస్టింగ్ కంపన్సేషన్ కలిపి 2018 కంటే 2019లో ఎనిమిది శాతం తగ్గింది.

టిమ్ కుక్ మొత్తం 963.5 మిలియన్ కంపన్సేషన్
టిమ్ కుక్ 2011 నుంచి యాపిల్ సీఈవోగా ఉంటున్నారు. అప్పటి నుంచి ఇతని కంపన్సేషన్ 963.5 మిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. టిమ్ కుక్‌తో పాటు యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మాస్త్రీ, జనరల్ కౌన్సెల్ కేట్ అడమ్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కూడా అంతకుముందు ఏడాది కంటే 2019లో తక్కువ ప్రోత్సాహకాలు అందుకున్నారు. 4 మిలియన్ డాలర్ల నుంచి 2.6 మిలియన్ డాలర్లకు తగ్గింది.


Click it and Unblock the Notifications