Mukesh Ambani: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత మార్కెట్లపై మెుబైల్ దిగ్గజం ఆపిల్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తన ఉత్పత్తుల తయారీని ముందుగా ఇండియాకు మార్చిన ఆపిల్.. ఇప్పుడు సొంతంగా స్టోర్లను ఏర్పాటు చేయటం ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కావాలని చూస్తోంది.
ఈ క్రమంలో ముంబైలో తన మెుదటి రిటైల్ స్టోర్ ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ గ్రుప్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన Jio World Drive మాల్‌లో దీనిని ఆపిల్ ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ఏకంగా 20,806 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. ఐదేళ్ల పాటు ఇక్కడే స్టోర్ కొనసాగనుంది. దీనికి ముందు సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ నేరుగా తన వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్లను స్వీకరించటం ప్రారంభించింది.

Jio వరల్డ్ డ్రైవ్ మాల్‌లో ప్రత్యేకమైన ప్రాంతంలో ఆపిల్ తన స్టోర్‌ను ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఇతర పోటీ కంపెనీలైన అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్, ఎల్‌జి, మైక్రోసాఫ్ట్, సోనీ వంటి 22 పోటీ బ్రాండ్‌లకు చెందిన ప్రకటనలు ప్రదర్శించకూడదని ఆంక్షలు పెట్టింది. దీనికోసం నెలకు ఏకంగా రూ.42 లక్షలను అద్దె రూపంలో ఆపిల్ అంబానీ సంస్థకు చెల్లించనుంది. ఈ లెక్కన ఏడాదికి అద్దె రూపంలోనే రూ.5 కోట్లను ఆపిల్ చెల్లిస్తుందని వెల్లడైంది. అయితే ప్రతి 3 ఏళ్లకు ఒకసారి అద్దె 15 శాతం మేర పెంపు ఉంటుందని తెలుస్తోంది.

ఇదే క్రమంలో రెండవ స్టోర్‌ను ఆపిల్ బెంగళూరులో ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ఏకంగా 1.16 లక్షల చదరపు అడుగుల ప్రాంతాన్ని కమర్షియల్ బిల్డింగ్ లో లీజుకు తీసుకుంది. 10 సంవత్సరాలకు కుదుర్చుకున్న ఈ లీజులో నెలకు అద్దె రూ.2.43 కోట్లుగా ఉంది. కబ్బన్ రోడ్‌లోని ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ నిర్మించిన వాణిజ్య భవనంలో ఆపిల్ తన స్టోరును ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


Click it and Unblock the Notifications