Hyderabad: అత్యధిక జనాభాతో స్కిల్ లేబర్ కలిగిన భారత మార్కెట్లపై ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. క్రమంగా ఇది చైనా నుంచి తన ఉత్పత్తిని ఇండియాకు మార్చుతోంది.
ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడులకు సంబంధించిన కీలక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ విలువను కూడా మూడు రెట్ల వరకు పెంచుతున్నట్లు గతవారం ప్రకటించింది. ఇదే క్రమంలో భారత మార్కెట్లో తన విక్రయాలు పెంచుకునేందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉత్పత్తిని ఆపిల్ ఇండియాకు షిఫ్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతిని కూడా ప్రారంభించింది.

ఐఫోన్ తయారీదారు ఆపిల్ తన వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఎయిర్‌పాడ్స్ తయారీని ఫాక్స్‌కాన్ హైదరాబాద్ ఫ్యాక్టరీలో ప్రారంభించనుందని వెల్లడైంది. డిసెంబర్ 2024 నాటికి భారీ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్న హైదరాబాద్ ప్లాంట్ కోసం ఫాక్స్‌కాన్ 400 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ఆమోదించింది. ఈ వార్తలు నిజమేనని పలు మూలాల ద్వారా వెల్లడైంది. కానీ రెండు సంస్థలు మాత్రం దీనిపై అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. తెలంగాణలో ఉత్పత్తి ప్రారంభమైతే ఇక్కడి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఐఫోన్లను మాత్రమే భారత్ లో తయారు చేస్తుండగా.. తాజా చర్యతో రెండవ ఉత్పత్తి ఎయిర్ పాడ్స్ కూడా మేడ్ ఇన్ ఇండియాగా మారనున్నాయి. పరిశోధనా సంస్థ కెనాలిస్ ప్రకారం ఆపిల్ ఎయిర్ పాడ్స్ డిసెంబర్ 2022 త్రైమాసికంలో ప్రపంచ TWS మార్కెట్‌లో 36 శాతం వాటాను కలిగి ఉంది. యాపిల్ తర్వాతి స్థానాల్లో శాంసంగ్ 7.5 శాతం, షియోమీ 4.4 శాతం, బోట్ 4 శాతం, ఒప్పో 3 శాతం మార్కెట్ వాటాతో ఉన్నాయి. ఈ ఏడాది నోయిడాలోని ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో Xiaomi కూడా వీటి ఉత్పత్తిని ప్రారంభించింది.


Click it and Unblock the Notifications