AP Real Estate: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు రియల్ ఎస్టేట్ ఆస్తులపై ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటారని తెలిసిందే. ప్రధానంగా తెలుగు ప్రజలు భూములపై ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. పొలాలు, స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్లు, కమర్షియల్ ప్రాపర్టీల్లో వారు పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు, చెన్నై సహా అనేక నగరాల్లో వీరు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఏపీ స్టాంప్స్ అండ్ డ్యూటీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కేవలం ఒక్కవారంలో ఏకంగా 68,000 రిజిస్ట్రేషన్లను చూసింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల వల్ల ఏకంగా రూ.475.44 కోట్లను ఆదాయంగా ప్రభుత్వ ఖజానాకు ఏపీలో చేరింది. అలాగే జనవరి 27 నుంచి జనవరి 31 వరకు నిర్వహించబడిన 56,649 రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వం రూ.356.25 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ప్రజలు ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ల కోసం క్యూ కట్టడంతో చంద్రబాబు ప్రభుత్వం మంచి ఆదాయాన్ని అందుకుంది.

హఠాత్తుగా ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం పరిగెట్టడానికి కారణాన్ని పరిశీలిస్తే.. ఏపీ ప్రభుత్వం భూమి రిజిస్ట్రేషన్ రేట్లను వివిధ అంశాల ఆధారంగా ముఖ్యంగా అభివృద్ధి కార్యకలాపాల ఆధారంగా సవరిస్తున్నట్లు ఉత్తర్వు జారీ చేసింది. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 16,997 గ్రామాలు, 9,054 మునిసిపల్ అండ్ అర్బన్ వార్డులలో భూమి ధరలు పెరిగాయి. ఇదే క్రమంలో 68 గ్రామాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదే క్రమంలో 158 గ్రామాలు, 145 పట్టణ వార్డుల్లో భూమి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న గుంటూరుతో పాటుగా కాకినాడల్లో భూమి రిజిస్ట్రేషన్ విలువలు తగ్గటం గమనార్హం. ఇదే క్రమంలో విజయవాడ, విశాఖ, ఏలూరు, కోనసీమ-ప్రకాశం జిల్లాల్లో భూమి ధరలు 3-9 శాతం మధ్య పెంపుకు లోనయ్యాయి. డిసెంబర్ 2024లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ మెుత్తంగా రూ.951.29 కోట్ల ఆదాయాన్ని అందుకుంది. 2023 డిసెంబరు నెలలో ఆదాయం కంటే ఇది 32.32% అధికం కావటం గమనార్హం. ఇది చూస్తుంటే ఏపీలో రియల్ ఎస్ట్రేట్ మెల్లగా పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు.
రాష్ట్రప్రభుత్వం తన ఖజానాకు ఆదాయాన్ని పెంచుకునేందుకు భూముల విలువను పెంచింది. దీంతో ప్రజలు సైతం ధర ఆధారంగా రిజిస్ట్రేషన్ స్టాంపు విలువను చెల్లించాల్సి ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.13,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించింది. జనవరి 2025 వరకు పది నెలల్లో భూమి రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ.7,170.62 కోట్లుగా ఉంది. వాస్తవానికి గత ఏడాదితో పోల్చితే ఇది దాదాపు 7 శాతం కంటే ఎక్కువ తగ్గుదల. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులను వేగంగా ఆకర్షిస్తున్నందున రియల్టీ రంగం మెల్లగా వృద్ధి వేగాన్ని అందుకుంటుందని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications