Population policy: పిల్లల పెంపకానికి నెలకు వెయ్యి రూపాయలు.. ఉచిత విద్య! ఎవరికి వర్తిస్తుందంటే..
ఒకప్పుడు జనాభాను తగ్గించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలు, ఇప్పుడు పెంచడానికి పథకాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక విప్లవాత్మకమైన "జనాభా నిర్వహణ" పాలసీ (Population Policy) ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) గణనీయంగా పడిపోవడంతో.. రాబోయే రోజుల్లో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

రూ. 25,000 నగదు ప్రోత్సాహకం
ఈ నూతన విధానం ప్రకారం, రెండో బిడ్డ జన్మించిన తల్లిదండ్రులకు "పోషణ్ శిక్షా సురక్ష ప్యాకేజీ" కింద రూ. 25,000 నగదు అందజేయనున్నారు. ఒకవేళ మూడో బిడ్డ పుడితే.. ఆ బిడ్డకు ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు నెలకు రూ. 1,000 పోషకాహార భృతిని కూడా ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాకుండా మూడో బిడ్డకు 18 ఏళ్ల వయస్సు వరకు ప్రభుత్వ లేదా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు. ఇది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించి, ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కంట్రోల్ నుండి కేర్ వరకు (From Control to Care)
గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. "పాపులేషన్ కంట్రోల్" స్థానంలో "పాపులేషన్ కేర్" విధానాన్ని అమలు చేయనున్నారు. అంటే ప్రభుత్వం బలవంతం చేయకుండా నిర్ణయాన్ని కుటుంబాలకే వదిలేస్తూ వారికి అన్ని విధాలా అండగా ఉంటుంది. రాష్ట్రంలో టీఎఫ్ఆర్ (TFR) 1.5 కి పడిపోవడంపై చంద్రబాబు అలారం మోగించారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 23 శాతానికి చేరుతుందని, దీనివల్ల యువ కార్మికుల కొరత ఏర్పడి ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
మహిళా సాధికారత, ప్రసూతి సెలవులు
ఈ జనాభా విధానం కేవలం పిల్లలను కనడంపైనే కాదు, మహిళల భద్రత , ఉపాధిపై కూడా దృష్టి సారించింది. ప్రస్తుతం 31 శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తిని 59 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లు, షీ-క్యాబ్స్, పని చేసే మహిళల కోసం హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ , ప్రైవేట్ రంగాల్లో పనిచేసే తల్లిదండ్రుల కోసం 12 నెలల పేరెంటల్ లీవ్ (తల్లికి) , 2 నెలల పటర్నిటీ లీవ్ (తండ్రికి) ఇవ్వాలని ప్రతిపాదించారు. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతుల కోసం పీపీపీ మోడల్‌లో ఐవీఎఫ్ (IVF) క్లినిక్‌లను కూడా అందుబాటులోకి తేనున్నారు.
ఈ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యవంతంగా, సంపన్నంగా మార్చడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ ముసాయిదాపై వచ్చే 30 రోజుల పాటు ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.


Click it and Unblock the Notifications