Vizag News: ఏపీ ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తోంది. దీని సన్నాహకాల్లో భాగంగా పలు రాష్ట్రాలలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి పలు రోడ్డుషోలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ వేదికగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలను పారిశ్రామికవేత్తలకు వివరించింది.

ఐటీ పరిశ్రమలకు..
హైదరాబాద్ మాదిరిగానే విశాఖ కూడా కాస్మోపాలిటన్ సంస్కృతితో వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధిని కలిగి ఉంది. ఇక్కడి వాతావరణం ఐటీ సేవల రంగంలోని కంపెనీలకు అత్యుత్తమ గమ్యస్థానమని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇన్వెస్టర్లకు వెల్లడించారు. ప్రపంచ ఐటీ డెస్టినేషన్‌గా విశాఖను మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఆయన తెలుపుతూ పరిశ్రమలకు 48,000 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలిపారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లుగా ఏపీ నెం.1 స్థానంలో ఉంటూ.. త్వరలో 2023-2028కి కొత్త ఐటీ పాలసీని తీసుకురాబోతోంది. స్టార్టప్ కల్చర్‌ను ప్రోత్సహిస్తూ, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, నైపుణ్యంతో పాటు ఉపాధి కల్పనను ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎగుమతుల్లో 1.44 లక్షల కోట్ల వృద్ధితో 6వ స్థానంలో ఉంది. మొబైల్ తయారీ రంగంలో ప్రతి నెలా 3.5 మిలియన్ మొబైల్‌లను ఉత్పత్తి చేస్తోంది.

ఆసియా దేశాలకు ముఖ ద్వారం..
సుదీర్ఘ సముద్రతీరం ఉండటం ఎగుమతులు, దిగుమతులకు కలిసొస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. ఏపీ ఆసియా దేశాలకు ముఖ ద్వారమని ఆయన అన్నారు. ఆటోమోటివ్‌లో.. అశోక్ లేలాండ్, కియా, హీరో, ఇసుజు, అపోలో, యోకోహామా, భారత్ ఫోర్జ్ వంటివి ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ డిజైన్ అండ్ తయారీలో బ్లూ స్టార్, ఫాక్స్‌కాన్, డయాకాన్, పానాసోనిక్, జడ్ టీటీ, ఫ్లెక్స్, వింటెక్ వంటి క్లస్టర్‌లను ఏపీ కలిగి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఫార్మాస్యూటికల్స్ రంగంలో మైనోల్న్, బయోకాన్, లుబెన్, హెటెరో, లూరెస్, దివిస్, ఆరిబిందో, జీఎస్‌కే, డాక్టర్ రెడ్డిస్ వంటి కంపెనీలు ఇప్పటికే ఏపీలో తమ కార్యకలాపాలను కొనసుగిస్తున్నాయని మంత్రి తెలిపారు. వ్యాపార వాతావరణానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థ ఏపీలో ఉందని తెలిపారు.

జంట నగరాలు..
కాకినాడ, నెల్లూరు, కడప.. ఇలా అనేక ఇతర జిల్లాల్లో అనేక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా అపారమైన అవకాశాలను ఏపీ అందిస్తోందని ఏపీటీపీసీ చైర్మన్ రవిచంద్రారెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో భోగాపురం విమానాశ్రయంతో విజయనగరం, వైజాగ్ జంట నగరాలుగా ఆవిర్భవిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో..
కోకో ఉత్పత్తిలో 70% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భరత్ కుమార్ తోట తెలిపారు. ఏపీ కేవలం రైస్ బౌల్ మాత్రమే కాదన్న ఆయన.. దేశంలోనే పెద్ద చాక్లెట్ బౌల్ అని ఇన్వెస్టర్లకు తెలిపారు. ఇదే క్రమంలో అరటిపండ్లు, ఆహారం, సుగంధ ద్రవ్యాలు, టమాటా ప్రాసెసింగ్ కోసం ఏపీలో నాలుగు మెగా యూనిట్లు రానున్నాయని వెల్లడించారు.


Click it and Unblock the Notifications