AP News: చంద్రబాబు ఫ్రీ గ్యాస్ సిలిండర్ల హామీలో షాక్.. కొత్త ట్విస్ట్ తలనొప్పి..!!
Free LPG: దీపావళికి ప్రజలు లక్ష్మీదేవి పూజతో పాటు పిండివంటలు చేసుకుంటుంటారు. దీనికి తోడు చాలా మంది బంగారం, వెండి వంటి ఆభరణాల షాపింగ్ కూడా చేస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళికి బంధువులు, స్నేహితులను పిలుచుకుని అనేక రకాల వంటకాలను సిద్ధం చేసుకుని సంతోషంగా గడుపుతుంటారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఎన్నికల్లో మాటిచ్చినట్టుగానే ఉచితంగా గ్యాస్ సిలిండర్ దీపావళి నుంచి అందించటం ప్రారంభించాలని నిర్ణయించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ గ్యాస్ సిలిండర్లను నేటి నుంచి ఉచితంగా అందించటానికి ఏర్పాటు చేసింది. అయితే ఈ స్కీమ్ కింద లబ్ధిదారులుగా మారటానికి అవసరమైన మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం వెల్లడించింది. తెల్లరేషన్ కార్డు కలిగి, గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరు పథకం పొందేందుకు అర్హులని ఏపీ సర్కార్ వెల్లడించింది. అర్హులైన లబ్ధిదారులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత విధానంలో సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ డెలివరీ సమయంలో కస్టమర్ గ్యాస్ సిలిండర్ కొనుగోలుకు పూర్తిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీని తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల్లో లబ్ధిదారుని ఖాతాలోకి ఆ సొమ్మును ప్రభుత్వం తిరిగి జమచేస్తుందని వెల్లడైంది. ముందుగా డబ్బులు చెల్లించటం చాలా మంది గ్రామీణ వినియోగదారులు తలనొప్పిగా భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం జెమిలి ఎన్నికలకు వెళ్లే ఉద్దేశ్యంలో ఉన్నందున చంద్రబాబు సర్కార్ ఉచిత సిలిండర్ల పథకాన్ని హడావిడిగా ప్రారంభించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఏడాదిలో ఎప్పుడెప్పుడు ఉచిత సిలిండర్లను అందించనుందనే క్యాలెండర్ సైతం కూటమి సర్కార్ ప్రకటించింది. ఈ నెలాఖరు నుంచి మార్చి 2025 మధ్యలో ఒకటి, ఏప్రిల్-జూలై మధ్యలో రెండవ సిలిండర్ ఇవ్వనున్నారు. ఇక మూడో సిలిండర్ జూలై నుంచి నవంబర్ మధ్యలో పైన పేర్కొన్న తరహాలోనే ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. స్కీములో ఏదైనా ఇబ్బంది కలిగితే 1967 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని వినియోగదారులకు సూచించింది.
ఇక్కడ పథకంలో ఉన్న పెద్ద సమస్య ఒకటి బయటపడింది. వాస్తవానికి ఈకేవైసీ కింద ఇప్పటికే గ్యాస్ డిస్టిబ్యూషన్ సంస్థల వద్ద తమ కస్టమర్లకు సంబంధించిన ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలు, ఆధార్ వివరాలు ఉన్నాయి. కానీ వాటి వద్ద కస్టమర్లకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డు వివరాలు మాత్రం అందుబాటులో లేవని తెలుస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషను కార్డు వివరాలను స్కీమ్ అర్హతను నిర్ణయించటానికి ప్రామాణికంగా పెట్టడంతో లబ్ధిదారులు డబ్బుల కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగక తప్పదని తెలుస్తోంది.
డబ్బులు ఖాతాలో పడటానికి ఏజన్సీలకు రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీలు అందించాల్సి రావొచ్చని, ఇది పెద్ద వయస్సు వారికి కొంత ఇబ్బందిని కలిగిస్తుందని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సిలిండర్ డెలివరీ సమయంలోనే సదరు గ్యాస్ ఏజెన్సీలు రేషన్ కార్డ్ వివరాలను సేకరిస్తే ప్రజలకు ఇబ్బంది తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై సర్కార్ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications