AP Liquor: లిక్కర్ ప్రియులకు షాక్.. సెప్టెంబర్ 7 నుంచి ఏపీలో షాప్స్ బంద్.. ఎందుకంటే..?
AP Liquor Shops Bandh: ఏపీలో కూటమి ప్రభుత్వానికి లిక్కర్ సమస్యలు వరుసగా చుట్టుముడుతున్నాయి. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అనేక బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి వచ్చిన నాశిరకం మద్యానికి బదులు మంచి సరుకు తెస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఏపీ లిక్కర్ పాలసీలో అనేక మార్పులు చేటుచేసుకుంటున్నాయి.
మార్పుతో పాటు కొత్త చిక్కులు సైతం కూటమి ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. తాజాగా సెప్టెంబర్ 7 నుంచి మద్యం దుకాణాలు బందా చేయాలని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రకటించారు. ఈ క్రమంలోనే వారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సీఎం చంద్రబాబుకు ఒక లేఖ సైతం రాశారు. గతంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం తమను ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిందని అయితే ప్రస్తుతం ప్రభుత్వ మార్పుతో తాము ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వారు తమ గోడును సీఎంకు వెళ్లబుచ్చారు.

దీనికి ముందు ఏపీ ఎక్సైజ్ పాలసీ ద్వారా తమకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతో ఉన్న మద్యం షాపుల ఉద్యోగులు ఒకరోజు మాత్రమే షాపులను మూసివేసి నిరసన వ్యక్తం చేయాలని ఏపీ బేవరేజెస్ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. అయితే ఇప్పుడు అది మరింత సమయం కొనసాగనున్నట్లు తాజా పరిణామాలతో తెలుస్తోంది. ఉద్యోగుల ఆందోళన వెనుక అసలు కారణం కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మద్యం షాపులను ప్రైవేటు పరం చేయాలని చూడటమేనని తెలుస్తోంది. గత ప్రభుత్వం తమను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించినప్పటికీ.. కనీస వేతనం కూడా సమయానికి అందించలేదని తమకి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఓటీలు కూడా ఏజెన్సీలు తినేశాయని వారు ఆరోపిస్తున్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలు తొలగిపోతాయని భావించామని వారు చెబుతున్నారు. గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ గడువు ముగియనున్న నేపథ్యంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న మోడల్‌పై ప్రత్యేక దృష్టి సారించి మరో 6 రాష్ట్రాల మద్యం పాలసీలను స్ఫూర్తిగా తీసుకుని కొత్త పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. 2023లో ప్రవేశపెట్టిన తెలంగాణ లిక్కర్ పాలసీ గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించడంలో విజయవంతమైన సంగతి తెలిసిందే. తెలంగాణ మాదిరిగా పాలసీని సిద్ధం చేస్తే కేవలం దరఖాస్తుల రుసుము రూపంలోనే దాదాపు రూ.2000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications