digital payments: భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ చెల్లింపుల పాత్ర ఎంతో ఉంది. కరోనా పుణ్యామా అని అవి మరింత పెరిగాయి. తొలుత నెట్ బ్యాంకింగ్ నుంచి మొదలు పెట్టి.. ఇప్పుడు డిజిటల్ వాలెట్ లు, UPIల వరకు చెల్లింపు విధానంలో ఎంతో మార్పు వచ్చింది. ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) సైతం ఈ జాబితాలోకి చేరింది.

మొదట 11 దుకాణాల్లో:
ఏపీ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం నుంచి మద్యం దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రవేశపెట్టింది. పైలట్ ప్రాజెక్టుగా మొదట విజయవాడలోని 11 దుకాణాల్లో ఈ సేవలు ప్రారంభించింది. త్వరలోనే రాష్ట్రంలోని ఇతర అవుట్ లెట్లకూ విస్తరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు.

క్రెడిట్ కార్డులపై ఛార్జీలు:
APSBCL రిటైల్ అవుట్ లెట్ లలో మద్యం కొనుగోళ్లకు ప్రస్తుతమున్న నగదు చెల్లింపుతో పాటు UPI, QR కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపుల విధానం తీసుకొచ్చినట్లు రజత్ భారగ్వ చెప్పారు. తద్వారా ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం వంటి యాప్ ల ద్వారా తేలికగా చెల్లింపులు చేయవచ్చన్నారు. డెబిట్ కార్డు, UPI ద్వారా చెల్లింపులకు ఎటువంటి ఛార్జీలు ఉండవన్నారు. కానీ క్రెడిట్ కార్డు చెల్లింపులపై మాత్రం సేవా రుసుము వసూలు చేస్తామని తెలిపారు. ఈ డిజిటల్ చెల్లింపులకు స్టేట్ బ్యాంక్ డిజిటల్ పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

సమర్థ పర్యవేక్షణ కోసమే..
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం నగదు చెల్లింపులనే అనుమతించే వారు. కానీ చిల్లర సమస్య, సిబ్బంది చేతివాటం, నిధుల దుర్వినియోగం వంటి సమస్యలను అరికట్టడానికి డిజిటల్ దిశగా అడుగులు వేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానం ద్వారా దుకాణాల సమర్థవంతమైన నిర్వహణతో పాటు లావాదేవీలను నిశితంగా పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications