విశాఖలో ఎకరానికి 99 పైసలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, పెట్టుబడులు ఎలా వస్తాయంటూ..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విశాఖపట్నంలో ఐటీ సంస్థలకు ప్రభుత్వ భూకేటాయింపుల విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ ఐటీ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా వ్యాఖ్యానించింది. పెట్టుబడులను రప్పించడానికి ప్రోత్సాహకాలు అనివార్యమని, అవి లేకపోతే ఏ కంపెనీ కూడా ముందుకు రాదని ప్రశ్నించింది.ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే ఆ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని AP High court తెలిపింది.
ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపించగా.. ధర్మాసనం ఈ విషయంలో భవిష్యత్ ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ప్రోత్సాహకాలు లేకపోతే కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్‌ల వంటి నగరాలకు తరలిపోతాయి. రాష్ట్రంలో ఐటీ కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగాలు, ప్రభుత్వానికి ఆదాయం వస్తాయని తెలిపింది. నామమాత్రపు ధరతో భూకేటాయింపులను చిన్నచూపు చూడకూడదని కోర్టు పేర్కొంది. పెట్టుబడులు రాకపోతే రాష్ట్రం వ్యవసాయ ఆధారితంగా మిగిలిపోతుందని, ఖాళీ భూములు తప్ప ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాదని స్పష్టం చేసింది.

కాగా విశాఖ జిల్లా మధురవాడలో 22 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌కు ఎకరానికి 99 పైసల చొప్పున ప్రభుత్వం కేటాయించిన సంగతి విదితమే. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిల్‌ను 'సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ, ఎన్విరాన్‌మెంటల్ రైట్స్' విశాఖ జిల్లా అధ్యక్షురాలు ఎన్. నమ్మిగ్రేస్ దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది జడ. శ్రావణ్‌కుమార్ వాదిస్తూ.. రూ. 1,109 కోట్ల విలువ చేసే 22 ఎకరాలను కాగ్నిజెంట్‌కు విక్రయించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. లీజు పద్ధతిలో ఇవ్వాల్సిన భూములను ఏపీఐఐసీ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తోందని ఆరోపించారు. ఈ భూముల విలువ, కేటాయింపు ప్రక్రియ, నూతన పారిశ్రామిక విధానం ప్రకారం జరగాలసిన విధానాన్ని అందులో ప్రశ్నించారు.
ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది ఎస్. ప్రణతి సమాధానమిస్తూ.. భూకేటాయింపులు నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగానే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడానికి ఐటీ రంగం అభివృద్ధి కోసం ఈ చర్యలు అవసరమని వాదించారు. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ సమర్పిస్తామని తెలిపారు.
భూకేటాయింపులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కౌంటర్ రూపంలో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ పిల్‌ను ఇప్పటికే దాఖలైన ఇతర ప్రజాహిత వ్యాజ్యంతో కలిపి విచారణ జరపాలని రిజిస్ట్రీని ఆదేశించింది.ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


Click it and Unblock the Notifications