ఆంధ్ర ప్రజలకు సబ్సిడీ ధరకే టమోటాలు.. నో లిమిట్.. కిలో ఎంతంటే..
Tomato prices: పెరుగుతూ పోతున్న టమోటా రేట్లను చూసి జనం బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే సెంచరీ కొట్టిన ధర ఇప్పట్లో ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. సబ్సిడీ ధరకు టమోటాలను విక్రయించాలని నిర్ణయించింది.
రుతుపవనాల ఆలస్యం కారణంగా దేశవ్యాప్తంగా టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో కిలో టమోటా రేటు 100కి పైగా పెరగడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఉపశమన చర్యలకు దిగింది. 50 రాయితీతో రైతు బజార్ల ద్వారా టమోటాలను విక్రయించడం ప్రారంభించింది. కడప మరియు కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చారు. కాగా త్వరలోనే ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది

బహిరంగ మార్కెట్‌లో టమోటా ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. కాగా ఈ పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రజలను గట్టెక్కించడానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రజలకు నాణ్యతతో కూడిన మెరుగైన టమోటాల సరఫరా జరిగేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లోని రైతు బజార్‌ల వద్ద స్థిరమైన ధరలు ఉండే విధంగా జగన్ సర్కారు చర్యలు తీసుకుంటోంది.
సబ్సిడీ ధరకు విక్రయించే ఈ టమోటాలపై పరిమితి విధించకుండా అవసరం మేర పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. పెరుగుతున్న ధరలపై ప్రజల్లో ఆందోళన తగ్గించడానికి సబ్సిడీ టమోటాల లభ్యత గురించి ఒకరోజు ముందుగానేై సమాచారం అందజేస్తామని రైతుబజార్ల CEO నంద కిషోర్ తెలిపారు.


Click it and Unblock the Notifications