AP Budget: ఏపీలో కొత్తగా ఏర్పాటైన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం తొలిసారిగా తమ పాలన మెుదలయ్యాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి నేడు పద్దు పుస్తకాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి బడ్జెట్ సమావేశం వచ్చే వారంలో ఉండగా దానిని ముందుకు జరపింది ప్రభుత్వం.
రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధారణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధంకాగా.. మరో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఒకప్పుడు టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం రైతులతో పాటు రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు ఆధారపడిన వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టిని పెట్టారని తెలుస్తోంది. దీంతో అన్నదాతలు తమకు సూపర్ సిక్స్ హామీల్లో ఒకటిగా ఉన్న రూ.20,000 ఆర్థిక సాయానికి సంబంధించి ఈ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు.

దీనికి ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ఐటీ మంత్రి నారా లోకేష్ తమ ప్రభుత్వం అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను ఏప్రిల్-మే నెలల్లో అమలు చేయటానికి సిద్ధంగా ఉందని ప్రకటిస్తూ స్పష్టతను ఇచ్చారు.
అసలు మెుత్తం బడ్జెట్ ఎంత..?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2025-26 రాష్ట్ర బడ్జెట్ మొత్తం వ్యయం రూ.3.24 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనిని శాసన మండలిలో కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టనుండగా.. ఇందులో రాజధాని అమరావతితో పాటు ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ప్రాతిపధికన నిధుల కేటాయింపు ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్లో దాదాపు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రుణాల చెల్లింపులు, వడ్డీల చెల్లింపులకు ఏకంగా రూ.1.30 లక్షల కోట్ల కేటాయింపు ఉంటుందని సమాచారం. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 64 లక్షల మందికి పెన్షన్ల కోసం మాత్రమే సంవత్సరానికి రూ.33,000 కోట్లు ఖర్చు చేస్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,94,427.25 కోట్ల వ్యయంతో ప్రభుత్వం బడ్జెట్‌ను సమర్పించింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,35,916.99 కోట్లుగా, మూలధన వ్యయం రూ.32,712.84 కోట్లుగా అంచనా వేయబడింది. అంచనా వేసిన రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు, ఆర్థిక లోటు రూ.68,742.65 కోట్లు, ఇవి స్థూల జీడీపీలో వరుసగా 2.12%.. 4.19%గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications