Tirumala Laddu: తిరుమల వెంకన్నకు నెయ్యి కష్టాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్..
Nandini Ghee: కలియుగ ప్రత్యక్షదైవంగా కోట్లాది మంది భక్తుల నుంచి రోజూ పూజలు అందుకుంటున్న తిరుమల శ్రీవేంకటేశ్వరుని చుట్టూ నెయ్యి వివాదం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ సమస్యకు అసలు పరిష్కారం దొరికిందా లేదా అసలు టీటీడీలో ఏం జరుగుతుందనే ఆందోళన శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయంలో అందించే లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనెతో చేసిన నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. తిరుమలలో శ్రీవారికి ప్రసాదం పెట్టి భక్తులకు విక్రయించే లడ్డుల నాణ్యతను పునరుద్ధరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతూ.. కొత్త నెయ్యి సరఫరాదారుగా మరోసారి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ని సంప్రదించింది. దేవుడికి ప్రసాదంగా ఇచ్చే లడ్డులో జంతువులకు సంబంధించిన కొవ్వులను వాడటంపై చంద్రబాబు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు ఇష్టంగా తినే తిరుమల వెంకన్న లడ్డూల తయారీలో వాడే నెయ్యి నాణ్యత విషయంలో ఇకపై ఎటువంటి రాజీ ఉండబోదని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు హామీ ఇచ్చారు. గతంలో 2013-2018 మధ్య కాలంలో తిరుమల లడ్డూల తయారీ కోసం నందిని కంపెనీ నుంచి 3,000 టన్నుల నెయ్యిని ఉపయోగించారు. అలాగే 2019లో కూడా దాదాపు 1,700 టన్నులు సరఫరా చేసిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఇటీవలి సంవత్సరాలలో నెయ్యి సరఫరా కోసం వేలంలో అవకాశం పొందలేదు. గత ప్రభుత్వం ఆఫర్ చేసిన నెయ్యి రేటు చాలా తక్కువగా ఉండటంతో ఆ రేట్లకు సరఫరా అసాధ్యంగా భావించిన నందిని సంస్థ సరఫరా ఆసక్తి నుంచి పక్కకు తప్పుకుంది.
టీటీడీ ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యి కొనుగోలుకు వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడుతున్నారనే ఆరోపణలు రావడంతో మళ్లీ నెయ్యి సరఫరాదారుగా కేఎంఎఫ్‌ను ఏపీ కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది. గడచిన 15 రోజులుగా మళ్లీ నెయ్యి సరఫరాను నందిని సంస్థ తిరిగి ప్రారంభించినట్లు వెల్లడైంది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ రానున్న 3 నెలల్లో టన్నుల నెయ్యి సరఫరా చేసేందుకు ఆర్డర్ టీటీడీ నుంచి అందుకుంది. నందిని నెయ్యి తిరుపతి లడ్డూతో ముడిపడి ఉందని KMF అధ్యక్షుడు భీమా నాయక్ అన్నారు. 2020-24 మధ్య బిడ్డింగ్‌లో గెలవని నందిని ప్రస్తుతం తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరాకు టెండర్ వచ్చింది.
తిరుమలకు సరఫరా చేసేందుకు అవసరమైన స్థాయిలో తమ వద్ద నెయ్యి నిల్వలు ఉన్నాయని భీమా నాయక్ వెల్లడించారు. ప్రస్తుతం తమ సంస్థ కుక్కే సుబ్రమణ్య, ధర్మస్థల, కొల్లూరు, కడెల్ వంటి ప్రధాన ఆలయాలకు నెయ్యి సరఫరా చేస్తోందన్నారు. నందిని నెయ్యిని ప్రోత్సహించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆలయాలకు నందిని నెయ్యి కొనుగోలు చేయాలనే ఆర్డర్‌తో కేఎంఎఫ్‌కు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు నాయక్ తెలిపారు.


Click it and Unblock the Notifications