Railway Budget: రెండు రోజుల కింద దేశీయంగా మోదీ సర్కార్ రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈసారి కేంద్రం రూ.2,52,200 కోట్లను రైల్వేలకు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తాజా బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించబడిందని తెలుస్తోంది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ కు రూ.9,417 కోట్లను కేటాయించినట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. వాస్తవానికి ఇది గత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే రూ.266 కోట్లు అదనంగా ఉంది. ఇదే క్రమంలో పొరుగున ఉన్న తెలంగాణకు రూ.5,337 కోట్లను కేంద్రం అందించింది. ఏపీలో కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో రూ.84,559 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో మెుత్తంగా 73 రైల్వే స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేసి పూర్తిగా ఆధునీకరించనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఏపీలో రైల్వే నెట్‌వర్క్ ప్రస్తుతం 100 శాతం విద్యుదీకరణ చెందిందని మంత్రి తెలియజేశారు. అలాగే రైల్వే భద్రతను పెంచి ప్రమాదాలను అరికట్టేందుకు కవచ్ ఏర్పాటులో సౌత్ సెంట్రల్ రైల్వే ముందంజలో కొనసాగుతోందని, ఇప్పటికే దీని పరిధిలోని వివిధ విభాగాలలో 1,465 కిలోమీటర్ల మేర కవచ్ ప్రమాదాల నిరోధానికి రక్షణ వ్యవస్థ ఏర్పాటుచేయబడిందని అన్నారు. ప్రస్తుతం కవచ్ 4.0 వెర్షన్ ట్రయన్‌రన్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. రానున్న 6 ఏళ్లలో దేశవ్యాప్తంగా కవచ్ రైల్వే నెట్‌వర్క్‌లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
రైల్వేలు 7,000 కిలోమీటర్ల పాత ట్రాక్‌లను పునరుద్ధరించాలనే లక్ష్యాన్ని ప్రకటిస్తూ.. ముఖ్యమైన విభాగాల్లో 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడానికి ట్రాక్స్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. అలాగే మరికొన్ని మార్గాల్లో 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వేల అభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబు నుంచి అద్భుతమైన సమన్వయం, సహకారం ఉందని కేంద్ర మంత్రి ప్రశంశించారు.
వందే భారత్ స్లీపర్ రైళ్ల డిమాండ్ ముఖ్యంగా.. విశాఖ-తిరుపతి మధ్య రైలు కోసం అభ్యర్థన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీ అక్టోబర్ 2024లో ఆమోదించబడిందని సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ పాటిల్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.2,245 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. దీని ద్వారా అమరావతి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందని అన్నారు. నాలుగేళ్లను దీనిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications