Anup Engineering Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం క్యూ4 ఫలితాల కోలాహలం కొనసాగుతోంది. కొన్ని కంపెనీలు అనూహ్యంగా ఊహించని లాభాలు ప్రకటించటంతో ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీనికి తోడు కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు సూపర్ డివిడెండ్ ఆదాయాన్ని సైతం అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అనూప్ ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. కంపెనీ తాజాగా తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించటంతో కంపెనీ షేర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపటంతో ఇంట్రాడేలో స్టాక్ ధర ఏకంగా 19 శాతం మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో కంపెనీ షేర్ల ధర రూ.2,186.95 స్థాయికి చేరుకుంది. జనవరి నుంచి మార్చి కాలంలో కంపెనీ నికర లాభం రూ.43.03 కోట్లుగా నివేదించబడింది. అయితే ఇది గత ఏడాది ఇదే కాలంలో కేవలం రూ.19.46 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ లాభం డబుల్ అయ్యింది.

గడచిన ఆర్థిక సంవత్సరంలో అనూప్ ఇంజినీరింగ్ మొత్తం లాభం రూ.103.50 కోట్లుగా నమోదైంది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.51.40 కోట్లకు డబుల్. ఏడాది కాలంలో కంపెనీ వ్యాపార పనితీరు మెరుగుపడటం ఇన్వస్టర్లను ఆకర్షిస్తోంది. మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన కంపెనీ తన ఇన్వెస్టర్లకు మరో శుభవార్త కూడా చెప్పింది. ఒక్కో షేరుపై రూ.15 మధ్యంతర డివిడెండ్, రూ.5 ప్రత్యేక డివిడెండ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ లెక్కన అర్హులైన ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై రూ.20 డివిడెండ్ రూపంలో అందుకోనున్నారు.
ఒక పక్క కంపెనీ తన పనితీరుతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటుండగా.. దానికి తగినట్లుగా మరోపక్క కంపెనీ షేర్లు ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. గడచిన 6 నెలల కాలంలో అనూప్ ఇంజినీరింగ్ షేర్ ధర 69 శాతానికి పైగా పెరిగింది. ఏడాది కాలం నుంచి కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు ఏకంగా 263 శాతం రాబడిని అందుకున్నారు. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర నేడు మధ్యాహ్నం 12.33 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో 12.72 శాతం లాభపడి రూ.2,069.95 రేటు వద్ద కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ.564.50గా ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.2,185 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications