AI రాకతో ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది.. సంచలన లేఖతో ఆంత్రోపిక్ సేఫ్‌గార్డ్స్ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా..
ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలను వణికించిన ఆంత్రోపిక్ (Anthropic)లో ఊహించన పరిణామం చోటు చేసుకుంది. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా కీలకంగా మారుతున్న Anthropic సంస్థలో సేఫ్‌గార్డ్స్ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 9న తన పదవికి రాజీనామా చేస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా లేఖ ద్వారా తెలిపారు.
అయితే ఈ లేఖ సాధారణ రాజీనామా ప్రకటనలా కాకుండా.. మానవాళి ఎదుర్కొంటున్న విస్తృతమైన సంక్షోభాలపై గంభీర హెచ్చరికగా నిలిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచం పరస్పరం అనుసంధానమైన అనేక సంక్షోభాల ముగింపు దశ వైపు సాగుతోందని శర్మ లేఖలో అభిప్రాయపడ్డారు. సాంకేతిక అభివృద్ధి వేగం మన నైతిక ఆలోచనలను మించిపోతున్నదనే ఆందోళన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.

ఆంత్రోపిక్ సంస్థ మొదట భద్రత ముందుగా అనే సిద్ధాంతంతో ప్రారంభమైందని.. కానీ ప్రస్తుతం అది అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజాల మద్దతుతో వాణిజ్య శక్తి కేంద్రంగా మారుతున్న దశలో ఉందని శర్మ సూచించారు. సుమారు 350 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకున్న సంస్థకు ఇది అత్యంత కీలకమైన మలుపు అని పరిశీలకులు భావిస్తున్నారు. తన రాజీనామా లేఖలో శర్మ.. కవి రైనర్ మరియా రిల్కే,విలియం స్టాఫోర్డ్ వంటి రచయితల గురించి ప్రస్తావిస్తూ.. మానవాళి యొక్క సాంకేతిక శక్తికి తగిన స్థాయిలో జ్ఞానం, నైతికత పెరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే మన సామర్థ్యం ఎంత వేగంగా పెరుగుతుందో, అంతే వేగంగా మన అవగాహన కూడా పెరగాలని ఆయన రాశారు.
AI వల్ల కలిగే ప్రమాదాలే కాకుండా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న పరస్పరం అనుసంధానమైన రాజకీయ, సామాజిక, సాంకేతిక సంక్షోభాల శ్రేణి కూడా మానవాళికి పెద్ద ముప్పుగా మారుతోందని శర్మ స్పష్టం చేశారు. ఈ రాజీనామా ఆంత్రోపిక్ సంస్థలోని అంతర్గత సంస్కృతిపై కూడా చర్చను రేపింది. వాణిజ్యీకరణపై అసంతృప్తితో OpenAI నుంచి నిష్క్రమించిన మాజీ కార్యనిర్వాహకులు స్థాపించిన సంస్థగా ఆంత్రోపిక్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే సంస్థపై ఇలాంటి విమర్శలు రావడం గమనార్హం.
వేగంగా ఎదుగుతున్న సంస్థలో విలువలను ఆచరణలో నిలబెట్టడం ఎంత కష్టమో శర్మ తన అనుభవంతో వెల్లడించారు. మన విలువలు మన నిర్ణయాలను నిజంగా నియంత్రించడం ఎంత కష్టమో నేను పదే పదే చూశానని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన చివరి ప్రాజెక్టులలో ఒకటిగా AI సహాయకులు మానవత్వాన్ని ఎలా వక్రీకరించవచ్చో ఆయన అధ్యయనం చేసినట్టు వెల్లడించారు. ఇది కార్యాలయ పనుల కోసం రూపొందిస్తున్న ఏజెంటిక్ AI వైపు సంస్థ మొగ్గు చూపుతున్న తరుణంలో మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఈ పరిణామాలు క్లాడ్ ఓపస్ 4.6 అనే అధునాతన AI మోడల్ విడుదలైన కొద్ది రోజులకే జరగడం విశేషం. పెట్టుబడిదారుల ఒత్తిడి, OpenAIతో పోటీ కారణంగా వేగంగా ఉత్పత్తులు విడుదల చేయాలనే ప్రయత్నం భద్రతా ప్రమాణాలపై ప్రభావం చూపి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శర్మ మాత్రమే కాకుండా, ఇటీవల AI శాస్త్రవేత్త బెహ్నామ్ నేషాబర్, R&D నిపుణుడు హర్ష్ మెహతా కూడా సంస్థను విడిచిపెట్టారు. అయితే ఈ రాజీనామాలపై గానీ, శర్మ లేఖలో లేవనెత్తిన అంశాలపై గానీ ఆంత్రోపిక్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఏదేమైనా ఈ రాజీనామా AI భవిష్యత్తు, భద్రత, నైతికతపై ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసే కీలక ఘట్టంగా మారిందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications