Paytm COO: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(PPBL)పై రిజర్వ్ బ్యాంక్ చర్యల తర్వాత కంపెనీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. టాప్ లెవల్ మేనేజ్‌మెంట్ లోని పలువురు సంస్థను వీడారు. కేవలం PPBL మాత్రమే కాకుండా దాని ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా సీనియర్స్ బయటకు క్యూకట్టారు. గత రెండు రోజుల క్రితమే పేటీఎం మనీ CEO వరుణ్ శ్రీధర్ రాజీనామా చేశారు. కాగా ఇప్పుడు మరొకరు సంస్థకు దూరమయ్యారు.
పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) భవేష్ గుప్తా కంపెనీకి రాజీనామా చేసినట్లు సంస్థ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన పేటీఎంలోని లోన్స్, ఆన్‌లైన్ /ఆఫ్‌లైన్ చెల్లింపులు మరియు కంప్లయన్స్ విభాగాలకు బాధ్యత వహించేవారు. కొత్త లావాదేవీలను కొనసాగించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL)పై RBI నిషేధం విధించడం వల్ల ఆయన నేతృత్వంలోని వర్టికల్స్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

'పేమెంట్స్ మరియు లోన్స్ వ్యాపారాలను పర్యవేక్షిస్తున్న ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భవేష్ గుప్తా వ్యక్తిగత కారణాల వల్ల కెరీర్‌లో విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన అడ్వైజరీ రోల్‌కి మారనున్నారు. ఈ ఏడాది చివరి వరకు సంస్థ వృద్ధి పథంలో పలు కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేస్తారు' అని పేటీఎం ప్రకటించింది.
'భవేష్ అందించిన సహకారానికి, సంస్థ ఆపరేషన్స్ సజావుగా సాగేలా చేయడంలో ఆయన పాత్రకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెల్లింపులు మరియు రుణాలపై గతంలో కంటే ఇప్పుడు మా దృష్టి బలంగా ఉంది. మా ప్రణాళికలను అమలు చేయడానికి మా ప్రతి వ్యాపారంలో ఉన్న అనుభవజ్ఞులైన నాయకులతో నేను కలిసి పనిచేస్తాను' అని పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.
గుప్తా క్లిక్స్ క్యాపిటల్ (గతంలో GE క్యాపిటల్) నుంచి ఆగస్టు 2020లో పేటీఎంలో చేరారు. కాగా మే 31న కంపెనీ సేవల నుంచి రిలీవ్ కానున్నారు. నాయకత్వ నిర్మాణ మార్పుల్లో భాగంగా పేటీఎం మనీ CEOగా రాకేష్ సింగ్ నియమితులయ్యారు. గతంలో ఉన్న వరుణ్ శ్రీధర్ స్థానంలో రాకేష్‌ను సంస్థ కొత్తగా అపాయింట్ చేసింది.


Click it and Unblock the Notifications