ఢిల్లీ-ఎన్‌సిఆర్ ఆధారంగా గ్రోసరీ డెలివరీ స్టార్టప్ ఓటిపి (Otipy) అకస్మాత్తుగా కార్యకలాపాలను నిలిపివేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దింతో దాదాపు 300 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అంతేకాకుండా, కంపెనీ డెలివరీ భాగస్వాములు కూడా సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ వ్యవస్థాపకుడు అండ్ CEO వరుణ్ ఖురానా స్వయంగా టౌన్ హాల్ సమావేశంలో ఉద్యోగులకు ఈ సమాచారాన్ని అందించారు. అయితే, దీనిపై కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

మూగబోయిన కంపెనీ సేవలు: దీనికి సంబంధించి ఓటిపి యాప్ ఓపెన్ చేసి చూడగా ప్రస్తుతం పనిచేయడం లేదు. ఏదైనా ప్రాంతంలో లొకేషన్ ఎంటర్ చేసినప్పుడు, "ఈ ప్రాంతంలో సర్వీస్ లేదు" అనే మెసేజ్ వస్తోంది.
క్విక్ కామర్స్ దెబ్బ, వ్యాపారం మూసివేత: ఓటిపి మూసివేతకు ప్రధాన కారణంగా క్విక్ కామర్స్ (Quick Commerce) సంస్థల ప్రభావం అని చెబుతున్నారు. 10 నిమిషాల్లో డెలివరీ చేసే క్విక్ కామర్స్ కంపెనీలు మార్కెట్‌ను పూర్తిగా మార్చివేసాయి. ఇది ఓటిపి వంటి షెడ్యూల్డ్ డెలివరీ మోడళ్లను మాత్రమే కాకుండా, సాధారణ కిరాణా దుకాణాల అమ్మకాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది.
ఓటిపి వ్యాపార ప్యాట్రన్ : ఓటిపి B2B2C మోడల్‌పై పనిచేసింది. అంటే రైతుల నుండి నేరుగా తాజా పండ్లు ఇంకా కూరగాయలను సేకరించి, కమ్యూనిటీ రిసెల్లర్ల ద్వారా కస్టమర్లకు డెలివరీ చేస్తుంది. ఈ కంపెనీ జూన్ 2020లో క్రోఫార్మ్ అగ్రిప్రొడక్ట్స్ అనుబంధ సంస్థగా ప్రారంభమైంది.
ఓటిపి వ్యాపారం ఢిల్లీ-ఎన్‌సిఆర్ ఇంకా ముంబైలలో విస్తరించి ఉంది. ఇప్పటివరకు ఈ కంపెనీ సుమారు $44 మిలియన్ల నిధులను సేకరించింది. ఇందులో 2022లో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ ఇంకా ఇతర పెట్టుబడిదారుల నుండి $32 మిలియన్ల నిధులు వచ్చాయి. ఇటీవల, కంపెనీ నువామా అసెట్ మేనేజ్‌మెంట్ నుండి $2 మిలియన్ల లోన్ కూడా తీసుకుంది.
ఆదాయాలు ఉన్నా నష్టాలే: గత సంవత్సరం రూ.115 కోట్ల నుండి FY24లో ఓటిపి ఆదాయం రూ.164 కోట్లకు పెరిగింది. అయితే కంపెనీ ఉద్యోగులు ఇంకా విక్రేతలకు చెల్లింపులను ఆలస్యం చేస్తోంది. ఓటిపి మూసివేత ఆన్‌లైన్ గ్రోసరీ విభాగంలో పెద్ద మార్పులు జరుగుతున్నాయనడానికి సంకేతం. మరోవైపు, క్విక్ కామర్స్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. బ్లూమ్ వెంచర్స్ నివేదిక ప్రకారం, ఈ మార్కెట్ FY22లో $300 మిలియన్ల నుండి FY25లో $7.1 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.


Click it and Unblock the Notifications