EPS News: ఈమధ్య EPFO గురించి తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. సంస్థకు సంబంధించి ఇటీవల వెలువడిన కొన్ని నిర్ణయాలు చందాదారులకు మేలు కలిగించేవి కాగా మరికొన్నిటి పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీని లెక్కింపునకు సంబంధించి ఓ నిబంధనను EPFO మార్చివేసింది.
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) నిబంధనలను సవరిస్తూ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ రెండు నోటిఫికేషన్‌లను జారీ చేసింది. 10 సంవత్సరాలు పూర్తి కాకముందే సభ్యుడు ఈ పథకం నుంచి నిష్క్రమిస్తే EPS మొత్తం చెల్లింపుకు సంబంధించిన ఉత్తర్వులు వాటిలో ఒకటి. కాగా EPSకి ముందు ఉన్న కుటుంబ పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్న ఉద్యోగుల కోసం మరొక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

EPS నిబంధనల ప్రకారం ఓ సభ్యుడు 10 ఏళ్లపాటు సర్వీస్‌ను పూర్తి చేసినట్లయితేనే పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారు. కాగా ఆ వ్యవధికి ముందే స్కీమ్ నుంచి ముందస్తుగా నిష్క్రమిస్తే పెన్షన్‌కు బదులుగా ఒక లంప్సమ్ అమౌంట్ ఇవ్వబడుతుంది. ఇందుకుగాను అర్హత పొందే మొత్తం చెల్లింపును లెక్కించడానికి వినియోగించే టేబుల్ 'D'కి ఇప్పుడు కార్మికశాఖ మార్పులు చేసింది.
'ఇంతకుముందు ఉద్యోగి 4 సంవత్సరాల 7 నెలలు పెన్షన్ స్కీమ్‌లో సభ్యుడిగా ఉంటే.. 5 సంవత్సరాల సర్వీస్ ఆధారంగా లంప్సమ్ ప్రయోజనం పొందేవారు. 6 నెలలు దాటిన తర్వాత దానిని మరుసటి ఏడాదిగా లెక్కించేవారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగి సర్వీసుకు సంబంధించిన 55 నెలల ప్రాతిపదికనే ఏక మొత్తాన్ని అందుకుంటారు. సిబ్బంది పొందే ప్రయోజనాన్ని ఇది స్వల్పంగా తగ్గించవచ్చు' అని EY ఇండియా పీపుల్ అడ్వైజరీ సర్వీసెస్ పార్టనర్ పునీత్ గుప్తా తెలిపారు.
ఇక ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద అర్హులైన సభ్యులకు పెన్షన్ ప్రయోజనాలు ఫ్యాక్టర్ నంబర్స్ ఆధారంగా లెక్కించబడతాయి. ఇది సభ్యుని పూర్తయిన సంవత్సరాల ఆధారంగా ఒక సంఖ్యను కేటాయిస్తుంది. ఈ సంఖ్య ఉద్యోగికి చెల్లించాల్సిన పెన్షన్ ప్రయోజనాలను ఎన్ని సంవత్సరాల సర్వీస్ ప్రకారం లెక్కించాలో తెలుసుకోవడానికి ఉపయోగించబడుతుంది. గతంలో 34 ఏళ్ల వరకు సర్వీస్ పూర్తి చేసిన సభ్యుల కోసం ఈ 'ఫాక్టర్' అందుబాటులో ఉండేది. అంతకు పైబడిన వారికి ఎలాంటి 'ఫాక్టర్' అందించలేదు.


Click it and Unblock the Notifications