Angel One: లక్షలాది ఏంజెల్ వన్ యూజర్ల డేటా లీక్.. వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష్యం.. కంపెనీ రియాక్షన్
Data hack: ఓ పక్కన పెరుగుతున్న సాంకేతికతను చూసి గర్వపడాలో, దానితో పాటే ఉత్పన్నమవుతున్న సమస్యలను చూసి బాధ పడాలో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ వల్ల మానవ జీవన ప్రమాణాలను మెరుగుపడుతుండగా.. అదే సాంకేతికతతో అందిన కాడికి దోచుకునేందుకు దుండగులు సైతం రెడీ అయ్యారు. సైబర్ అటాక్‌లు, హ్యాకింగ్స్‌తో సున్నితమైన ఆర్థిక, వ్యక్తిగత డేటాను చోరిచేసి సొమ్ము చేసుకుంటున్నారు.
ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఏంజెల్ వన్ డేటా లీక్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 8 మిలియన్ల కస్టమర్లు దీని ద్వారా ప్రభావితమైనట్లు వార్తలు వచ్చాయి. ఒక వెబ్‌సైట్‌లో బాధిత వినియోగదారుల పేర్లు మరియు చిరునామాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ లీక్ చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. సదరు కస్టమర్ల లాభనష్టాల ప్రకటనలతో కూడిన సున్నితమైన డేటాను అజ్ఞాత వ్యక్తి యాక్సెస్ చేసినట్లు పేర్కొంది. ఈ డేటా 2023 నాటిదని ఓ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ చెప్పినట్లు వెల్లడించింది.

ఈ నివేదికపై ఏంజెల్ వన్ స్పందించింది. కస్టమర్ డేటా సురక్షితంగా ఉందని, కొత్తగా ఎటువంటి డేటా లీక్ జరగలేదని తెలిపింది. ప్రస్తుత సమస్య ఏప్రిల్ 2023లో జరిగిన సంఘటనకు సంబంధించినది కాగా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దీని వల్ల క్లయింట్ సెక్యూరిటీలు, ఫండ్స్, లాగిన్ సమాచారంపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. తమవద్ద అన్ని క్లయింట్ ఖాతాలు సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చింది.
గత ఏడాది ఏప్రిల్‌లో ఏంజెల్ వన్ డేటా ఉల్లంఘనకు గురైంది. అయితే ప్రభావితమైన కస్టమర్ల సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. ప్రభావితమైన వినియోగదారుల పేర్లు, మొబైల్ నంబర్‌లు మరియు ఇమెయిల్ చిరునామాలు మాత్రమే లీక్ అయినట్లు పేర్కొంది. నిధులు మరియు సెక్యూరిటీలకు సంబంధించిన సమాచారం సురక్షితంగా ఉందని భరోసా ఇస్తున్నట్లు అప్పట్లో వివరించింది.
భారత్‌లో ఒక్క 2023లోనే ఒక్కో సంస్థ వారానికి దాదాపు 2 వేల 138 దాడులను ఎదుర్కొన్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ తెలిపింది. సిస్కో 2024 సైబర్‌సెక్యూరిటీ రెడీనెస్ ఇండెక్స్ కూడా కేవలం 4 శాతం భారతీయ సంస్థలు మాత్రమే సైబర్ సెక్యూరిటీ ప్రమాదాలను ఎదుర్కోవడానికి రెడీ ఉన్నట్లు వెల్లడించింది. మరో 37 శాతం తమ ఇందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా 3 శాతం మాత్రమే సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications