ఆంధ్రప్రదేశ్‌లో రికార్డుస్థాయి GST వసూళ్లు.. సెప్టెంబర్‌లో సరికొత్త హిస్టరీ క్రియేట్..
ఆగస్టు 2025లో GST రేట్ల తగ్గింపు కారణంగా వ్యాపార లావాదేవీలు కొంతకాలం మందగించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అత్యధిక GST వసూళ్లను నమోదు చేసింది. ఈ వసూళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలుగా మాత్రమే కాకుండా, పన్ను సమ్మతి (Tax Compliance) విధానాలు సక్రమంగా అమలు అవుతున్నాయి అనే విషయాన్నీ సూచిస్తున్నాయని రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఎ తెలిపారు.
2017లో GST అమలులోకి వచ్చినప్పటి నుండి, సెప్టెంబర్ 2025 రెండవ అత్యధిక స్థూల GST వసూళ్లు సాధించిన నెలగా నిలిచిందని తెలిపారు. ఈ నెలలో రాష్ట్రం సాధించిన నికర GST వసూళ్లు రూ.2,789 కోట్లు కాగా, ఇది ఇప్పటివరకు సెప్టెంబర్ నెలల్లో నమోదైన అత్యధిక మొత్తం. అదే సమయంలో స్థూల వసూళ్లు రూ.3,653 కోట్లకు చేరాయి, ఇది సెప్టెంబర్ నెలల్లో రెండవ అత్యధికమని ఆయన అన్నారు.
ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2025 వరకు మొత్తం ఆరు నెలలపాటు, స్థూల, నికర GST వసూళ్లు గత ఆర్థిక సంవత్సరాల్లోని ఇదే కాలంతో పోలిస్తే ఎప్పుడూ అధికంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టతను స్పష్టంగా చూపిస్తోందని బాబు వివరించారు. సెప్టెంబర్ 2024తో పోలిస్తే నికర GST వసూళ్లు 7.45 శాతం పెరిగాయి, స్థూల వసూళ్లు 4.19 శాత్ పెరిగాయి. సెప్టెంబర్ 2023తో పోలిస్తే మరింత బలమైన వృద్ధి నమోదైంది. నికర వసూళ్లు 12.67% పెరిగాయి.

రాష్ట్ర GST (SGST) వసూళ్లు మాత్రమే రూ.1,185 కోట్లకు చేరాయి, ఇది సెప్టెంబర్ 2024తో పోలిస్తే 8.28% వృద్ధి. 2023తో పోలిస్తే 5.5% పెరుగుదల కనిపించిందన్నారు. సెప్టెంబర్ 2025లో IGST సెటిల్మెంట్ల ద్వారా రాష్ట్రం రూ.1,605 కోట్లు పొందింది. ఇది 2024తో పోలిస్తే 6.84 శాతం పెరుగుదల, 2023తో పోలిస్తే 18.62 శాతం వృద్ధి. ఇది రాష్ట్ర పన్ను పరిపాలనలో పారదర్శకత, సకాలంలో సయోధ్యలు, ప్రభుత్వం స్వీకరించిన సమర్థవంతమైన పరిష్కార విధానాలకు ప్రతిఫలమని పన్నుల విభాగం పేర్కొంది.
GST మాత్రమే కాదు, ఇతర పన్నుల వసూళ్లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. పెట్రోలియం ఉత్పత్తులపై ఆదాయం రూ.1,380 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 3.10 శాతం పెరిగింది. ప్రొఫెషనల్ టాక్స్ ఆదాయం మాత్రం అత్యధిక వృద్ధిని సాధించింది. సెప్టెంబర్ 2025లో ఒక్క నెలలోనే 43.75 శాతం పెరిగింది. మొత్తంగా ఏప్రిల్-సెప్టెంబర్ 2025 వరకు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 51.51 శాతం పెరుగుదల కనిపించింది.
రాష్ట్రం అమలు చేసిన వ్యూహాత్మక ప్రణాళికలు, మెరుగైన పన్ను సమ్మతి పద్ధతులు ఈ వృద్ధికి కీలకం. గతంలో కనిపించిన ఆర్థిక మందగమనాన్ని సెప్టెంబర్ 2025 వసూళ్లు విజయవంతంగా తిప్పికొట్టాయని రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఎ తెలిపారు.


Click it and Unblock the Notifications