ఏపీలో తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ సేవలు ప్రారంభం.. ఉచిత సేవలకు అర్హులు వీరే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తల్లి, శిశు మరణాలను అరికట్టడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వినూత్నమైన, భారీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అత్యవసర ప్రసూతి రవాణా సేవలను మరింత వేగవంతం చేసేందుకు 102 - తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లను అధునాతన భద్రతా ఫీచర్లు, స్మార్ట్ ట్రాకింగ్,అధునాతన సౌకర్యాలతో పూర్తిస్థాయిలో ఆధునీకరించింది.
ప్రసూతి అత్యవసర రవాణా కోసం ప్రత్యేకంగా సమగ్ర భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేయడంలో ఈ చొరవ దేశంలోనే మొట్టమొదటిదిగా నిలిచింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆధునీకరించిన ఈ వాహనాలను ఆగస్టు 11న గుంటూరు జిల్లా నరసరావుపేటలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అధికారికంగా ప్రారంభించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలోనూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సమగ్ర ఆధునీకరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 500 ఎయిర్ కండిషన్డ్ ఎంయూవీ, ఎస్‌యూవీ వాహనాలను కొనుగోలు చేస్తోంది. మొదటి విడత కింద 300 వాహనాలు తక్షణమే ప్రజలకు అందుబాటులోకి రానుండగా, మిగిలిన 200 వాహనాలు కూడా అతి త్వరలోనే ఈ సేవల్లో చేరనున్నాయి. విద్యావేద ఫౌండేషన్, శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ కలయికతో ఏర్పడిన వీవీఎఫ్-ఎస్‌టీటీ కన్సార్టియం ఈ నూతన సర్వీసును నిర్వహించనుండగా, ప్రభుత్వం ఈ సేవలకు గానూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 37.40 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన బాలింతలను సురక్షితంగా.. ఉచితంగా ఇంటికి చేర్చడం (డ్రాప్-బ్యాక్) తో పాటు, అధిక ప్రమాదం ఉన్న గర్భిణీలకు, రక్త మార్పిడి అవసరమయ్యే తీవ్ర రక్తహీనత కలిగిన రోగులకు అత్యవసర ప్రయాణ సౌకర్యం కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయాణంలో తల్లి, నవజాత శిశువుతో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది.
గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో '102' హెల్ప్‌లైన్ ద్వారా మొత్తం 2,05,914 మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా, అందులో 1,65,093 ప్రసవానంతర డ్రాప్-బ్యాక్ సేవలు, 40,821 అత్యవసర ప్రయాణాలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం, కొత్త వాహనాలలో తల్లి, బిడ్డల శారీరక సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ఎత్తు ఉండే ఫుట్‌రెస్ట్‌లు, గ్రిప్ హ్యాండ్‌రైల్స్, క్లైమేట్ కంట్రోల్ ఏసీలను అమర్చింది. భద్రతకు సంబంధించి వాహనంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, చైల్డ్-లాక్ డోర్లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, మరియు గంటకు 80 కిమీ దాటితే హెచ్చరించే స్పీడ్ అలర్ట్ సిస్టమ్‌ను పొందుపరిచారు.
ఏ క్షణంలోనైనా తక్షణ సహాయం కోసం సీటు పక్కనే అత్యవసర ఎస్ఓఎస్ బటన్, దాంతోపాటు జీపీఎస్, నావిక్, డ్యూయల్-సిమ్ 4జి టెక్నాలజీతో కూడిన AIS-140 ట్రాకింగ్ సిస్టమ్‌ను అనుసంధానించారు. ఇది డ్రైవర్లను నేరుగా తల్లి, శిశు ఆరోగ్య రిజిస్ట్రీలతో అనుసంధానించి ప్రయాణంలో ఆలస్యం కాకుండా నివారిస్తుంది. వాహనం లోపల ఛార్జర్లు, శానిటైజర్లు, ప్రథమ చికిత్స కిట్లు మరియు ఆరోగ్య సలహా కరపత్రాలు అందుబాటులో ఉంటాయి. పౌరులు ఎవరైనా 102 సంఖ్యకు కాల్ చేయడం ద్వారా ఈ సేవలన్నింటినీ పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.


Click it and Unblock the Notifications
