విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ భూమి సేకరణ.. ఎకరాకు రూ.2.55 లక్షలు పెంపును ప్రకటించిన ప్రభుత్వం
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరించాలనుకుంటున్న భూమికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం పెంచాలని నిర్ణయించింది. భూసేకరణలో ఇంత పెంపు గతంలో ఏరోజూ జరగలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. రైతులు మరింత పరిహారం కోరుతూ చేసిన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎకరాకు రూ.2.55 లక్షల అదనపు పరిహారం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది.
తర్లువాడలో ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.17 లక్షలు కాగా, ప్రభుత్వం ఇప్పుడు మార్కెట్ విలువకు రెండు రెట్లుకు పైగా పరిహారం నిర్ణయించింది. దీని ద్వారా డి-పట్టా రైతులు ఎకరాకు అదనంగా రూ.6.37 లక్షలు పొందనున్నారు. రైతులు భూమి కోల్పోతున్నందుకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, షాపింగ్ కాంప్లెక్స్, గృహనిర్మాణానికి 3 సెంట్ల స్థలాలు కూడా కల్పించబడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇది రైతుల ఆర్థిక భద్రతకు తోడ్పడుతుందని ఆయన వివరించారు.

రైతుల పేర్లను అనుమతి లేకుండా కోర్టులో వాడి కేసులు దాఖలు చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు ప్రస్తావించారు. మరణించిన రైతు పేరు కూడా పిటిషన్‌లో చేర్చడం వల్ల రైతులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభావవంతమైన వ్యక్తులు బినామీగా వ్యవహరించారని.. ఇటీవలి రోజులలో కొత్త వ్యక్తులు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను గమనించి వారిపై పోలీసు కేసు నమోదు చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వ్యక్తి తరపున వకాలత్‌నామా (Power of Attorney) ఎలా దాఖలు చేయబడిందో పూర్తి విచారణకు ఆదేశించారు.
విశాఖపట్నం IT రంగానికి Google data center ప్రాజెక్ట్ అత్యంత ముఖ్యమని గంటా శ్రీనివాసరావు తెలిపారు. రైతులను తప్పుదారి పట్టించేవారిపై, ప్రాజెక్ట్‌కు అడ్డంకులు సృష్టించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సంగీత మధుర్, ఎంఆర్ఓ శ్రీనుబాబు, తర్లువాడ సర్పంచ్ బిఆర్‌బి నాయుడు, గ్రామ రైతులు పాల్గొన్నారు. స్థానికంగా రైతులు, అధికారులు ఒకే వేదికపై సమస్యను చర్చించడం ప్రాజెక్ట్ విజయానికి కీలకం అని ఎంపీ పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని తర్లువాడలో సుమారు 200 ఎకరాల్లో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఇది భవిష్యత్తులో IT రంగ అభివృద్ధికి ఇది ప్రధాన కిక్షన్‌గా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. గూగుల్ సంస్థకు అవసరమైన భూమిని నవంబర్ నెలలో అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతోంది.
రాజకీయ నాయకులు, స్థానిక అధికారులు, రైతులు కలిసి భూమి సేకరణ, పరిహారం, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖపట్నం IT హబ్‌గా మరింత అభివృద్ధి చెందుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు విస్తృత ప్రయోజనం లభిస్తుందని భావిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం మొత్తం 200 ఎకరాలు అవసరం అవుతాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications