ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం..కేవలం ఈ 5 సర్వీసుల్లో మాత్రమే.. నాన్ స్టాప్ బస్సులు పథకం నుండి మినహాయింపు..
Free bus travel scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత దిశగా మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎన్డీఏలోని ఇతర ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఒక సాధారణ ప్రయాణికుడిలా APSRTC బస్సు ఎక్కి మహిళలతో కలిసి ప్రయాణిస్తూ స్వయంగా వారితో మమేకమయ్యారు సీఎం చంద్రబాబు .
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ నివాస హోదా కలిగిన బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తులందరూ ఉచితంగా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా APSRTC బస్సుల ద్వారా ప్రయాణించవచ్చు. ఓటర్ ఐడీ, ఆధార్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సహా ఇలాంటివి కండక్టర్లకు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు. రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా మహిళలు విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాల కోసం నిరభ్యంతరంగా ప్రయాణించగలిగేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

లబ్ధిదారులకు సేవలు అందించే లక్ష్యంతో మొదలైన ఈ పథకం ఐదు ముఖ్యమైన APSRTC బస్సులలో ఉచిత ప్రయాణం అందిస్తుంది. వాటిలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో మొత్తం 11,449 APSRTC బస్సులలో సుమారు 74 శాతం బస్సులు ఈ పథకం కింద పనిచేయనున్నాయి. అయితే రాష్ట్రంలో 16 రకాల బస్సు సర్వీసులు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. అయితే నాన్ స్టాప్ బస్సుల్లో ప్రవేశం ఉందా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. విజయవాడ-గుంటూరు, విశాఖ- శ్రీకాకుళం, తిరుపతి-కడప, నెల్లూరు-ఒంగోలు ,విజయవాడ-ఏలూరు, కాకినాడ- రాజమండ్రి, అనంతపురం-కర్నూలు, నంద్యాల-కర్నూలు, తిరుమల, పాడేరు, శ్రీశైలం ఘాట్ రోడ్డు పట్టణాల మధ్య పెద్ద సంఖ్యలో నాన్‌స్టాప్ బస్సులు ఉంటాయి.వీటిని ఉచిత బస్సు పథకంలో మినహాయించినట్లు తెలుస్తోంది.
అధికారుల అంచనాల ప్రకారం, రాష్ట్రంలోని సుమారు 2.62 కోట్లకు పైగా మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. పథకం ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఇది ఒక్క రవాణా పథకమే కాకుండా మహిళల జీవితాలలో ఆర్థిక స్వాతంత్ర్యానికి బలం చేకూర్చే కీలక సాధనంగా మారుతుందని అన్నారు. ఈ స్త్రీ శక్తి పథకం.. చంద్రబాబు 2024 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒక ప్రధాన హామీ. ఈ సూపర్ సిక్స్ వాగ్దానాల్లో మరికొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి.
19-59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం,
యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు =రూ. 3 వేలు నిరుద్యోగ భృతి,
తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి రూ.15 వేలు,
ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు (దీపం-2),
ప్రతి రైతుకు సంవత్సరానికి రూ. 20 వేలు (అన్నదాత సుఖీభవ).
కొత్తగా తీసుకొచ్చిన ఫ్రీ బస్ పథకం ఉచిత ప్రయాణాన్ని అందించడంలోనే కాదు, మహిళలకు రక్షణ, గౌరవం, తాము కూడా సమాన వనరులను ఉపయోగించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఒక కీలక మైలురాయిగా నిలవబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications