టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి కూడా ఇళ్లు పొందలేక నిరీక్షిస్తున్న వేలాది దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తాజా సమీక్ష సమావేశంలో.. ఇళ్ల కేటాయింపులు పొందని వారికి చెల్లించిన దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు సుమారు రూ. 174 కోట్ల మొత్తాన్ని రీఫండ్ చేయాల్సి ఉంది. ఈ నిర్ణయం ద్వారా చాలాకాలంగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఆర్థిక ఉపశమనం కలుగనుంది.
అదేవిధంగా ఇప్పటికే నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,00,875 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని, వీటి కోసం ప్రత్యేకంగా గృహ ప్రవేశ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని సూచించారు. దీని ద్వారా ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులు వేగవంతం కావడంతో పాటు, లబ్ధిదారులు త్వరగా తమ సొంత ఇళ్లలోకి వెళ్లే అవకాశం కలుగుతుంది.

మున్సిపల్ పరిపాలనను బలోపేతం చేయడంపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణ ప్రాంతాల్లో పారదర్శకతను పెంచేందుకు, 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో డిజిటల్ క్యూఆర్ కోడ్ ఆధారిత డోర్ నంబర్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ క్యూఆర్ కోడ్‌ల ద్వారా ఆస్తి పన్ను, నీటి సరఫరా, ఇతర సేవలకు సంబంధించిన వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
పట్టణాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. స్మార్ట్ వాటర్ పైప్‌లైన్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి, నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. నీటి నాణ్యతను కూడా నిరంతరం పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇక ప్రజలకు మున్సిపల్ సేవలను సులభంగా అందించేందుకు రూపొందించిన 'పురమిత్ర' యాప్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ యాప్‌లో 17 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ప్రజల నుంచి 92,000కు పైగా ఫిర్యాదులు అందగా, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, శాశ్వత పరిష్కారాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
పట్టణ పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు సాంకేతికతను వినియోగించాలని సీఎం సూచించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా డేటాను సమీకరించి, నగరాల అభివృద్ధికి ఉపయోగించాలని ఆదేశించారు. అంతేకాకుండా, మున్సిపల్ బాండ్లు విడుదల చేసి నిధులను సమీకరించడం, పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏదేమైనా టిడ్కో ఇళ్లపై తీసుకున్న తాజా నిర్ణయాలు, పట్టణ అభివృద్ధి చర్యలు, ఆంధ్రప్రదేశ్‌లో గృహ, మున్సిపల్ రంగాల్లో వేగాన్ని పెంచే దిశగా కీలక అడుగులుగా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications