నెల్లూరుకు మహర్దశ.. రూ. లక్ష కోట్ల BPCL గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక పెట్టుబడుల దిశగా మరో కీలక ముందడుగు వేసింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ప్రతిపాదించిన రూ. 1 లక్ష కోట్ల గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు సమీపంలో 6,000 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనుంది. 9 నుండి 12 MMTPA సామర్థ్యంతో ఉండే ఈ రిఫైనరీ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ యూనిట్లలో ఒకటిగా ఉండనుంది.
ప్రాజెక్ట్ మొత్తం వ్యయం దాదాపు రూ. 1.03 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం "అల్ట్రా-మెగా పెట్టుబడి"గా గుర్తించింది. భారీ మూలధన వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టుకు ప్రోత్సాహక ప్యాకేజీని ప్రత్యేకంగా రూపొందించింది. అందులో భాగంగా BPCL కు మూలధన వ్యయంలో 75 శాతం వరకు ఆర్థిక ప్రోత్సాహకాలను రాష్ట్రం సూత్రప్రాయంగా ఆమోదించింది. ఈ ప్రోత్సాహాలు ప్రాజెక్ట్ ప్రారంభం నుండి 20 సంవత్సరాలపాటు దశల వారీగా అందించబడతాయి.

ET నివేదిక ప్రకారం.. ప్రోత్సాహక ప్యాకేజీ కింద BPCLకు 43.5 శాతం మూలధన సబ్సిడీ లభించనుంది, ఇది 15 వాయిదాలలో విడుదల కానుంది. అదనంగా, కార్యాచరణ దశలో పూర్తి GST వాపసు లభిస్తుంది. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం SGSTను తిరిగి చెల్లించడానికి అంగీకరించింది. నిర్మాణ కాలంలో IGST, CGSTలో రాష్ట్ర వాటా కూడా తిరిగి ఇవ్వబడుతుంది. ఈ ప్రాజెక్టుకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపులు కూడా మంజూరు చేయబడ్డాయి.
BPCL జనవరి 2029 నాటికి రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు నిర్ణయించింది. ఇది అల్ట్రా-మెగా పెట్టుబడి కావడంతో, ప్రాజెక్ట్ పురోగతిని పర్యవేక్షించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ అన్ని సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తూ ప్రాజెక్ట్‌ను క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది.పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) నుండి ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు సమర్పించబడింది.
BPCL అంచనా ప్రకారం..ఈ 9 MMTPA సామర్థ్యం గల రిఫైనరీ 42 నెలల్లో పూర్తవుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణ దశలో దాదాపు 3,400 ఉద్యోగాలు రానున్నాయి. అందులో 400 శాశ్వత, 3,000 తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించబడతాయని కంపెనీ తెలిపింది. ఒకసారి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత, మరో 3,750 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా, వీటిలో 1,250 శాశ్వత, 2,500 తాత్కాలిక ఉద్యోగాలు ఉంటాయి.
BPCL ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావ నివేదిక (EIA) సమర్పించడానికి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల అంచనా కమిటీ (EAC) ఆదేశించింది. ఇందులో ప్రజా విచారణలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు, కార్యాచరణ ప్రణాళిక, ఖచ్చితమైన బడ్జెట్, అమలు కాలక్రమం వంటి వివరాలు ఉండాలి. ప్రతిపాదిత రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కి మొత్తం 600 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది.
అందులో 100 మెగావాట్లు BPCL స్వంత క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయనుండగా.., మిగిలిన 500 మెగావాట్లు రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ నుండి సరఫరా చేయనున్నారు..ఈ BPCL ప్రాజెక్ట్ విజయవంతమైతే, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల పటంలో మరో మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications