Hyderabad Rents: దేశంలోని రియల్టీ మార్కెట్ బూమ్ ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. బ్యాంకులు విరివిగా లోన్స్ ఇవ్వటంతో మధ్య తరగతి వారు సైతం సొంతింటి కలలను నిజం చేసుకుంటున్నారు. అయినప్పటికీ హైదరాబాద్ మహానగరంలో అద్దెల పెరిగుదల మాత్రం ఆగటం లేదు.
ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో హైదరాబాద్ అద్దె మార్కెట్ వివరాలను గమనిస్తే.. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో మెుదటి త్రైమాసికం కంటే తక్కువగానే అద్దెలు పెరిగాయని తాజా డేటా ప్రకారం వెల్లడైంది. ఇది క్యూ1లో 5 శాతంగా ఉండగా.. క్యూ2లో 3 శాతం అద్దెల పెరుగుదలను చూసింది. దేశంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకప్పుడు విపరీతంగా పెరిగిన అద్దె మార్కెట్లు ఇప్పుడు గృహాల సరఫరాలో పెరుగుదల కారణంగా స్థిరీకరణ సంకేతాలను చూపుతున్నాయి.

అనరాక్ తాజా డేటా ప్రకారం క్యూ2లో నగరాల్లోని కీలక మార్కెట్‌లలో సగటు రెసిడెన్షియల్ రెంటల్ ధరలు 2-4 శాతం త్రైమాసిక పెరుగుదలను నమోదు చేశాయి. ఇది క్యూ1లో కనిపించిన 4-9 శాతం దూకుడు పెరుగుదల కంటే తక్కువ కావటం గమనార్హం. Q2 2024లో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో సగటు అద్దెలు కేవలం 3 శాతం పెరిగాయి. గత త్రైమాసికంలో ఈ ప్రాంతాలు చూసిన 5 శాతం పెరుగుదల కంటే ఇది తక్కువ. నగరంలో 2024 చివరి నాటికి దాదాపు 34,770 హౌసింగ్ యూనిట్లు పూర్తవుతాయని, 2023లో 20,500 యూనిట్లు పూర్తయ్యాయని అనరాక్ తాజా నివేదిక తెలిపింది.
వాస్తవానికి ప్రతి ఏటా రెండవ త్రైమాసిక కాలంలో స్కూల్స్, కాలేజీలు వంటి విద్యా సంస్థలు ప్రారంభం కావటంతో ఇళ్ల అద్దెలు అధికంగానే పెరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ఆ ట్రెండ్ కనిపించకపోవటానికి మార్కెట్లో పెరుగుతున్న కొత్త గృహాల సరఫరా కారణంగా అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. కొత్త హౌసింగ్ యూనిట్ల సరఫరాలో ఈ పెరుగుదల అద్దె ధరలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications