Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఇండియన్ బిజినెస్ టైకూన్లలో ఆనంద్ మహీంద్రా ఒకరు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా పలువురికి ప్రేరణ ఇస్తూ తనవంతు సపోర్ట్ చేస్తుంటారు. మానవతా దృక్పథంతో కూడిన వివిధ సంఘటనలు పోస్ట్ లు చేస్తూ.. తోటివారికి ప్రేరణగా నిలుస్తున్నారు.
అటువంటి ఆనంద్ మహీంద్రాతో ఓ చిన్నారి కంటతడి పెట్టించాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆ బాలుడి వీడియోను లక్నోకు చెందిన అపోలో హాస్పిటల్స్ షేర్ చేయగా.. బిజినెస్ టైకూన్ Xలో దానిపై రియాక్ట్ అయ్యారు. ఇందులో తనను భాగస్వామ్యం చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. "నాకు మాటలు రావడం లేదు. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ధన్యవాదాలు @drsangitareddy. మానవత్వంతో చొరవ చూపినందుకు, మమ్మల్ని అందులో భాగం చేసినందుకు అపోలో హాస్పిటల్స్ కు ధన్యవాదాలు. కార్తీక్, నేను నీకు పెద్ద అభిమానిని' అంటూ Xలో ఆయన పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి పేరు కార్తీక్ సింగ్. లక్నోలోని అపోలో హాస్పిటల్ లో ప్రస్తుతం కీమోథెరపీ చేయించుకుంటున్నాడు. క్యాన్సర్ చికిత్స కోసం క్రమం తప్పకుండా ఆస్పత్రికి వచ్చి వెళ్తుంటాడు. ఆ బాలుడు ప్రతిసారీ మహీంద్రా థార్ గురించి చాలా ఆసక్తితో మాట్లాడుతుంటాడు. ఆ SUV అంటే తనకు చాలా ఇష్టమని, పెద్దయ్యాక కొనుగోలు చేస్తానని చెబుతుంటాడు.
దీంతో హాస్పిటల్ యాజమాన్యం కార్తీక్ కు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. తదుపరి కీమో సెషన్ సమయానికి అతడిని పికప్ చేసుకోవడానికి మహీంద్రా థార్ ను బాలుడి ఇంటికి పంపించాలని భావించింది. సమీప డీలర్ ను కలిసి మొత్తం స్టోరీ వివరించింది. వారు కూడా అందుకు ఒప్పుకోవడంతో ప్లాన్ పక్కా అయింది.
క్యాబిన్ పై బెలూన్లతో అలంకరించిన మహీంద్రా థార్ ని చూసి కార్తీక్ చాలా సంతోషించాడు. అందులో ప్రయాణించి హాస్పిటల్ కు వెళ్లాడు. రోగుల చిన్న కోరికలను తీర్చడానికి హాస్పిటల్ తీసుకున్న చొరవను ఆనంద్ మహీంద్రాతో పాటు పలువురు అభినందిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యానికి అతడి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications